Begin typing your search above and press return to search.

ఈసారి సార్వత్రిక ఎన్నికల స్పెషల్ ఏమిటో తెలుసా?

దేశ చరిత్రలో ఇప్పటివరకు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత సుదీర్ఘంగా సాగే రెండో ఎన్నికలుగా తాజా సార్వత్రిక ఎన్నికల్ని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   17 March 2024 5:25 AM GMT
ఈసారి సార్వత్రిక ఎన్నికల స్పెషల్ ఏమిటో తెలుసా?
X

ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తాజాగా వెలువడిన షెడ్యూల్ తో ఎన్నికల కోడ్ ఎంట్రీ అయ్యింది. మొత్తం 7 దశల్లో జరిగే ఈ ఎన్నికలు మొత్తం 44 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్నాయి. అదే సమయంలో షెడ్యూల్ విడుదలైన తేదీ (మార్చి 16) నుంచి కౌంటింగ్ తేదీ (జూన్ 4) వరకు చూస్తే ఏకంగా 82 రోజులు పట్టనుంది. అంటే.. దగ్గర దగ్గరగా మూడు నెలల సమయం పట్టనుంది. ఈ మూడు నెలల కాలంలో యావత్ దేశంలో అమలయ్యే ఎన్నికల కోడ్ కారణంగా పలు పనులకు ఆటంకంగా మారనుంది. ఇదిలా ఉంటే.. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.

దేశ చరిత్రలో ఇప్పటివరకు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత సుదీర్ఘంగా సాగే రెండో ఎన్నికలుగా తాజా సార్వత్రిక ఎన్నికల్ని చెప్పొచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951-52లో జరిగే మొదటి సార్వత్రిక ఎన్నికల సుదీర్ఘంగా నాలుగు నెలల పాటు సాగాయి. ఆ తర్వాత సా..గుతున్న సుదీర్ఘ ఎన్నికలు ఇప్పుడు జరిగేవే కావటం విశేషం. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. దేశంలో అతి తక్కువ వ్యవధిలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే 1980 జనవరిలో జరిగిన ఎన్నికలుగా చెప్పాలి. ఆ ఎన్నికలు కేవలం నాలుగు రోజుల్లో పూర్తి అయ్యాయి.

ఆసక్తికరమైన అంశం ఏమంటే 1962 నుంచి 1989 మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలన్నీ కూడా నాలుగు రోజుల నుంచి పది రోజుల వ్యవధిలోనే జరగ్గా.. 2004 నుంచి సార్వత్రిక ఎన్నికల్ని నిర్వహించే తీరులో తేడా వచ్చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలు మొదలు ప్రతి సారీ అంతకంతకూ గడువును పెంచుకుంటూ పోవటమే కనిపిస్తుంది. 2004లో సార్వత్రిక ఎన్నికల్ని నాలుగు విడతల్లో 21 రోజుల్లో పూర్తి చేస్తే.. 2009లో ఎన్నికల్ని 5 విడతల్లో నెల రోజుల్లో పూర్తి చేశారు.

2014 ఎన్నికల్ని మొత్తం 9 విడతల్లో 36 రోజుల్లో పూర్తి చేస్తే.. 2019లో జరిగిన ఎన్నికల షెడ్యూల్ ను 2019 మార్చి 10న ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 11 మొదలై మే 19 వరకు పోలింగ్ జరిగాయి. ఓట్ల లెక్కింపు మే 23న నిర్వహించారు. అంటే.. మొత్తం 43 రోజుల్లో ప్రక్రియ పూర్తైంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మరింత సుదీర్ఘంగా సాగింది. ఎన్నికల ఫలితాలు 2019లో మే 23న వెల్లడైతే.. ఈసారి మాత్రం జూన్ నాలుగున వెల్లడికానున్నాయి. ఇక్కడే.. పన్నెండు రోజులు తేడా ఉండటం గమనార్హం.

సుదీర్ఘంగా ఎన్నికల్ని నిర్వహించటం అధికార పక్షానికి మేలు చేసేలా.. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా జరుగుతోందన్న ఆరోపణల్ని మీడియా ప్రతినిధులు సీఈసీను ప్రశ్నించగా వారు ఖండించారు. ఈ అంశంపై సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు.. సెలవులు.. పండుగలు.. పరీక్షలు.. ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో నదులు.. కొండలు.. అడవులు.. ఇలా అనేక సవాళ్లు ఉన్నాయన్న ఆయన మాటల వేళ.. గతంలోనూ ఇవన్నీ లేవా? అప్పుడు లేనివి.. ఇప్పుడే వచ్చినవి ఏమున్నాయి? అన్న ప్రశ్నను సంధిస్తే మాత్రం సమాధానం లభించని పరిస్థితి.