Begin typing your search above and press return to search.

జెన్ జీ ప్రభువులు గర్జిస్తున్నారు !

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇది అక్షరాలా నిజం కూడా. తమ కోసం తమ తరఫున తమ గురించి పాటు పడుతూ సేవ చేసే వారిని ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు

By:  Satya P   |   24 May 2026 4:00 PM IST
జెన్ జీ ప్రభువులు గర్జిస్తున్నారు !
X

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇది అక్షరాలా నిజం కూడా. తమ కోసం తమ తరఫున తమ గురించి పాటు పడుతూ సేవ చేసే వారిని ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు. వారిని ప్రజా సేవకులు అంటారు. అంటే ప్రజలు అంతిమ ప్రభువులు అయినపుడు వారు ఓట్లేసి గెలిపించిన వారు ప్రజా సేవకులు అవుతారు. ఇది ప్రజాస్వామిక ముఖ్య సూత్రం. మౌలికమైన విషయం. అయితే దీనిని కాలానుగతంగా అంతా మరచిపోయారు. ప్రజలే బానిసలుగా మారుతున్న వైనం వర్తమానంలో కనిపిస్తోంది. ప్రజల సొమ్ముని తమ సొంత సొమ్ము ఇస్తున్నట్లుగా చెప్పుకుంటూ పథకాల పేరుతో ఆర్భాటం చేసే నయా ప్రభువులు అడుగడుగునా కనిపిస్తున్నారు. ప్రజలే ఈ ప్రభువుల కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడి గాపులు పడుతున్న సన్నివేశాలే ఎటు చూసినా కనిపిస్తున్నాయి.

భోగాలు అన్నీ వారికి :

ప్రజా సేవకులకు భోగాలు అన్నీ దక్కుతున్నాయి. కేవలం అయిదేళ్ళు పాలిస్తే చాలు జీవిత కాలం పెన్షన్ లభిస్తోంది. అంతే కాదు రైలు బస్సు విమానం ఇలా రవాణా సదుపాయాలు టెలిఫోన్ గ్యాస్ వంటి వాటిలో రాయితీలు ఎన్నో ఎన్నెన్నో దక్కుతున్నాయి ఈ అయిదేళ్ళూ తక్కువ కాదు, అధికారంలో ఉంటే బంగ్లాలు ఇస్తున్నారు, ఇక ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఉచితాలే. దాంతో పాత తరం సంగతి ఏమో కానీ జెన్ జీ తరం మాత్రం దీనిని చూసి సహించడం లేదు. ఏమిటీ వివక్ష అంటోంది. ప్రజా సేవకు వచ్చిన వారికి ఇన్నేసి సదుపాయాలు ఎందుకు అని ప్రశ్నిస్తోంది.

సీజేపీ మానిఫేస్టో :

బొద్దింక పార్టీ మేనిఫేస్టోని చూస్తే షాక్ కి గురి అవుతారు. ఇవే అక్కడ కనిపిస్తున్న విషయాలు. ప్రజా సేవకులకు ఎందుకు వైభోగాలు అని ప్రశ్నిస్తోంది జెన్ జీ తరం. వారికి బంగ్లాలు వద్దు, అందరి మాదిరిగానే నివాసాలు ఉండాలంటోంది. రాయితీల ఊసు అసలు వద్దు అంటోంది. భారీ ఎత్తున జీతాలు భత్యాలు ఆనక పెన్షన్లు ఇవన్నీ ఇవ్వడం ఏంటి అని మండిపడుతోంది. ఇలా వ్యవస్థలో దశాబ్దాలుగా ప్రజా సేవకులు అందుకుంటున్న అనేక రకాలైన సదుపాయాల మీద జెన్ జీ బిగ్ సౌండ్ చేస్తోంది. ఇవన్నీ పోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది.

జరిగే పనేనా :

ఈ రోజున ప్రజాస్వామ్యంలో చూస్తే ఇవన్నీ సర్వ సాధారణం అని సాదర జనం అంతా సర్దుకుని పోతున్నారు. సగటు జీవి తన ప్రారబ్దంగా పేదరికం వచ్చిందని అనుకుంటున్నాడు తప్ప సేవకులను ప్రశ్నించడం ఏనాడో మరచిపోయాడు. ఇలా కాలాలు గతించిపోతున్నాయి కానీ ఎవరూ ఏమిటీ తీరు ని నిలదీయడం లేదు. కానీ జెన్ జీ తరం పెద్ద నోరు చేస్తోంది. అసలైన ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను వల్లె వేస్తోంది. నిజమైన ప్రభువులు ప్రజలు కదా అని అంతా మరచిన సత్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రభువులకు పాట్లూ సేవకులకు వైభోగాలు ఏమిటి అని కూడా ప్రశ్నిస్తోంది. సీజేపీ మేనిఫేస్టో ఇదీ అని సోషల్ మీడియాలో పెడితే నూటికి నూరు శాతం జెన్ జీ తరం సేవకులూ మనలాంటి వారే వారికి ఏ సౌకర్యాలూ వద్దు అని గట్టిగా నినదిస్తోంది అంటే మార్పు ఎక్కడో మొదలైపోయినట్లే అంటున్నారు. తరాలు మారుతున్నాయి. ఇపుడు ఎవరికీ మింగుడు పడని జెన్ జీ తరం వస్తోంది. దాంతో అంతా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది అని అంటున్నారు.