రగులుతున్న కుంకుమపువ్వు.. మరో దేశంలో జెన్ జీ విప్లవం!
జెన్ జీ.. ఈ పేరు వింటేనే పాలకులు ఉలిక్కిపడే పరిస్థితి.. అనేక దేశాల్లో పీఠాలను కదిలించిన తరం ఇది.. ఇప్పుడు మరో దేశంలోనూ జెన్ జీ ఉద్యమిస్తోంది.
By: Tupaki Desk | 2 Jan 2026 11:53 PM ISTజెన్ జీ.. ఈ పేరు వింటేనే పాలకులు ఉలిక్కిపడే పరిస్థితి.. అనేక దేశాల్లో పీఠాలను కదిలించిన తరం ఇది.. ఇప్పుడు మరో దేశంలోనూ జెన్ జీ ఉద్యమిస్తోంది. కుంకుమ పువ్వుకు పేరుగాంచిన ఆ దేశంలో శీతాకాలంలోనూ వేడి రగిలిస్తోంది. దాదాపు మూడున్నరేళ్ల కిందట ఇదే దేశంలో ఓ యువతి మరణంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. మళ్లీ అంతలా కాకున్నా.. ఆర్థిక పరిస్థితులపై తమ గళాలు వినిపిస్తున్నారు. ఒకవైపు హద్దు లేని ధరల పెరుగుదల, మరోవైపు రెండేళ్లుగా పడిపోతున్న కరెన్సీ విలువ..! దీంతో జీవితం భారమై యువత వీధుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగానే జోక్యం చేసుకుంటోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగి.. అమాయక పౌరుల ప్రాణాలు పోతే తాము రంగంలోకి దిగుతామంటూ ఏకంగా అమెరికానే హెచ్చరించింది.
నెమ్మదిగా పాకుతున్న ఉద్యమం
ఇరాన్.. పశ్చిమాసియాలోని ఈ కీలక దేశంలో గత ఆదివారం నుంచి ప్రజల నిరసనలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్ లోనే. 1970కి ముందు పాశ్చాత్య దేశాల తరహాలో ఉండేది. ఇస్లామిక్ విప్లవం అనంతరం సంప్రదాయ దేశంగా మారింది. అయితే, పాలనలో వైఫల్యాలు ఇరాన్ ను దెబ్బతీస్తున్నాయి. హిజాబ్ ధరించలేదని 2022లో ఇహ్సా అమీనా అనే యువతిని దారుణంగా కొట్టి చంపడం ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతకు దారితీసింది. ప్రజలను రోడ్లపైకి వచ్చేలా చేసింది. ఇప్పుడు అధిక ధరలు, కరెన్సీ విలువ పతనం కూడా ప్రజలలో ఆగ్రహానికి దారితీస్తోంది. దీంతో పలు ప్రావిన్సుల్లో వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. పోలీసుల కార్లకు నిప్పు పెట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు, చాలామంది కూడా గాయపడినట్లుగా కథనాలు వస్తున్నాయి.
రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభం...
ఇరాన్ కరెన్సీ రెండేళ్లుగా పతనం అవుతోంది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తుతోంది. దీనికి అడ్డుకట్ట ఎంతకూ లేదు. అందుకని ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. అయితే, వీరిపై భద్రతా దళాలు గనుక కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పౌరులను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, ఈ ప్రకటనను ఇరాన్ సుప్రీం లీండర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు లార్జాని తప్పుబట్టారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా ఘర్షణలు చెలరేగుతాయని హెచ్చరించారు.
ముల్లాలు వెళ్లిపోవాలి
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగుతూ.. ముల్లాలు వెళ్లిపోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. గత ఆదివారం రాజధాని టెహ్రాన్ లో మొదలైన నిరసనలు దేశమంతా వ్యాపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో ప్రజలు భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. 2022లో అమిని మరణం తర్వాత ఇరాన్ లో జరుగుతున్న పెద్ద నిరనసనలు ఇవేనని పరిశీలకులు చెబుతున్నారు.
