Begin typing your search above and press return to search.

రిపోర్టు: ఫస్ట్ శాలరీని జెన్ జీ దేనికి ఖర్చు చేస్తున్నారు?

చాలా అంశాలకు సంబంధించి జరుగుతున్న చర్చంతా జెన్ జీ (జెనరేషన్ జెడ్) గురించే.

By:  Tupaki Desk   |   30 May 2025 12:57 PM IST
రిపోర్టు: ఫస్ట్ శాలరీని జెన్ జీ దేనికి ఖర్చు చేస్తున్నారు?
X

చాలా అంశాలకు సంబంధించి జరుగుతున్న చర్చంతా జెన్ జీ (జెనరేషన్ జెడ్) గురించే. 1996-2010 మధ్య కాలంలో పుట్టిన వారిని జెన్ జీగా పిలవటం తెలిసిందే. మరికొందరు 1997-2012 మధ్యలో పుట్టిన వారిని కూడా జెన్ జీగా పేర్కొంటారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉన్న తరం వీరే. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 32 శాతం మంది ఉన్నట్లుగా చెబుతారు. మిగిలిన తరాలకు భిన్నంగా.. తమకు తామే అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ.. భావోద్వేగాలకు సంబంధించి విలక్షణ రీతిలో వ్యవహరించే ఈ తరంలో విద్యావంతులు ఎక్కువన్న సంగతి తెలిసిందే.

డిజిటల్ యుగంలో కీలకభూమిక పోసిస్తున్న ఈ తరం వారికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర రిపోర్టు వచ్చింది. భారత్ ల్యాబ్ పేరుతో లక్నో వర్సిటీ.. రీడిఫ్యూజన్ అనే యాడ్ ఏజెన్సీలు కలిసి జెన్ జీ తరానికి చెందిన వారు తమ మొదటి జీతాన్ని ఎలా వాడతారు? అనే అంశంపై సర్వే నిర్వహించారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న టూటైర్.. త్రీ టైర్ నగరాలకు చెందిన 2125 మంది యువ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు.

వీరు తమ తొలి జీతాన్ని ఎలా ఖర్చు చేశారు? తర్వాతి కాలంలో నెలసరి జీతాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? అన్న అంశంపై ఫోకస్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిపోర్టులో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..

- తమ తొలి జీతాన్ని ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వటం ద్వారా తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. తొలి జీతం అందుకున్న వెంటనే తమ సంతోషాన్ని అమ్మతో పంచుకోవటం గమనార్హం. ఇలా చేశామని చెప్పినోళ్లు 44.6 శాతం మంది.

- తమ తొలి జీతం అందుకున్న విషయాన్ని తండ్రికి మొదటగా చెప్పినోళ్లు 28.6 శాతం కాగా.. జీవిత భాగస్వామికి షేర్ చేసినోళ్లు 16.1 శాతం. తోబుట్టువులకు 10.7 శాతం మందిగా గుర్తించారు. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువ ఈ అంశాన్ని తెలియజేస్తుందని.. జెన్ జీ భావోద్వేగం పాళ్లు తక్కువగా ఉంటాయనే దానికి భిన్నమైన సంకేతంగా చెప్పాలి.

- తాము అందుకున్న మొదటి జీతాన్ని జెన్ జీ మహిళల్లో 88.5 శాతం మంది తమ స్వాతంత్ర్యంగా పేర్కొనటం గమనార్హం. ఇదే భావనను అబ్బాయిలు వెల్లడించినప్పటికీ.. ఇంటికి ఇవ్వాలన్న బాధ్యతను 41.2 శాతం మంది పేర్కొనటం విశేషం.

- మొదటి జీతాన్ని పొదుపు చేసుకోవటం.. దానం చేయటం లాంటి రెండు భిన్నమైన అంశాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు ఉండటం గమనార్హం. 24.5 శాతం మంది తమ తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు.. హయ్యర్ ఎడ్యుకేషన్ కు సిద్ధం కావటం కోసం.. కష్ట సమయంలో కుటుంబానికి పనికి వచ్చేలా ఏర్పాట్లు చేయటం కనిపించింది.

- తమ జీతాన్ని పొదుపు చేసే విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలు తక్కువ ఆసక్తి చూపారు. కేవలం 32.3 శాతం మంది మాత్రమే పొదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే తమ తొలి జీతాన్ని 20.4 శాతం మంది దానం ఇచ్చేందుకు వినియోగించటం.

- తమ జీతాన్ని దానం చేసిన వారికి సంబంధించి.. ఏయే అంశాలకు దానం చేశారని ప్రశ్నించగా.. మత సంస్థలకు.. ఎన్జీవోలకు విరాళం ఇచ్చినట్లుగా పేర్కొనటం ద్వారా సమాజం పట్ల తమకున్న అవగాహన ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

- తమ తొలి జీతాన్ని దానం చేసే విషయంలో అమ్మాయిలు 41.6 శాతం మంది ఉంటే.. అబ్బాయిలు మాత్రం 27.7 శాతం మాత్రమే.

- తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8 శాతం మంది బహుమతుల ద్వారా పంచుకోవటం కనిపించింది.

- గుర్తుండిపోయే రోజును తల్లుల కోసం ఆభరణాలు కొనుగోలు చేయటం.. తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ ను కొనటం లాంటివి చేవారు. అంతేకాదు.. తమ జీవన ప్రయాణంలో తమకు అండగా నిలిచిన వారికి సైతం బహుమతులు ఇవ్వటం ద్వారా తమ కృతజ్ఞతను తెలుపుకోవటం కనిపించింది.

- ఇంట్లోకి అవసరమయ్యే నిత్యవసర వస్తువులు.. యుటిలిటీ బిల్లుల కోసం 12.2 శాతం మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాల కోసం 4.1 శాతం మంది తమ తొలి జీతాన్ని ఖర్చు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 88.3 శాతం మంది తమ మొదటి జీతం తమకు అవసరమైన ఖర్చులకు సరిపోయిందని చెబితే.. 11.7 శాతం మాత్రం సరిపోక ఇబ్బందులు పడినట్లుగా పేర్కొన్నారు.

- సర్వేలో పాల్గొన్న అమ్మాయిలో మూడింట ఒక వంతు మంది అమ్మాయిలు తమ తొలి జీతంతో ఆభరణాలు కాకుండా బంగారాన్ని కొనుగోలు చేశారు. బోసన్.. ప్రమోషన్.. పండుగ సందర్భాల్లో వచ్చే అదనపు ఆదాయంతో విహార యాత్రలు.. కలల బైక్ లాంటి వాటి కోసం ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.