'పాక్ డీజీఎంవో కాల్ కు భారత్ రెస్పాండ్ అయ్యుండకపోతే..'?
అయితే... పాక్ డీజీఎంవో కాల్ కు భారత్ రెస్పాండ్ అయ్యి ఉండకపోతే..? ఈ ప్రశ్నకు కార్గిల్ సమయంలో భారత డీజీఎంవోగా ఉన్న నిర్మల్ చందర్ విజ్ సమాధానం చెబుతున్నారు
By: Tupaki Desk | 17 May 2025 9:29 AM ISTఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో).. భారత డీజీఎంవోకు ఫోన్ చేయడం, అనంతరం కాల్పుల విరమణ అంగీకారం కుదరడం తెలిసిందే. అయితే... పాక్ డీజీఎంవో కాల్ కు భారత్ రెస్పాండ్ అయ్యి ఉండకపోతే..? ఈ ప్రశ్నకు కార్గిల్ సమయంలో భారత డీజీఎంవోగా ఉన్న నిర్మల్ చందర్ విజ్ సమాధానం చెబుతున్నారు.
అవును... భారత్ - పాక్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ అంగీకారం ఈ నెల 18 వరకూ ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో కార్గిల్ యుద్ధం సమయంలో భారత డీజీఎంవో గా ఉండి.. 2005లో ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన నిర్మల్ చందర్ విజ్.. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పాక్ ప్రవర్తన, ఆ దేశంతో తనకున్న అనుభవాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా.. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ డీజీఎంవో గా ఉన్న జనరల్ తౌకిర్ జియాతో తన సంభాషణలను గుర్తు చేసుకున్నారు జనరల్ విజ్. ఇందులో భాగంగా.. ఆ సమయంలోనే పాకిస్థాన్ అబద్ధాలు చెప్పడం, అస్పష్టంగా మాట్లాడటం అనేది తనకు స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఇదే సమయంలో... అబద్ధాలు చెప్పడం వారి పర్యావరణ వ్యవస్థలో ఒక భాగమని అన్నారు. వారికి నైతికత ఉండదని నొక్కి చెప్పారు!
పాకిస్థాన్ నుంచి వచ్చే ఏ ఉగ్రవాద చర్య అయినా.. యుద్ధ చర్యగానే చూస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో... పాక్ తో కాల్పుల విరమణ అంగీకారం, అవగాహనా కుదిరినప్పటికీ.. భారత్ కొంతకాలం అప్రమత్తంగానే ఉంటుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తో.. పాకిస్థాన్ కు కొన్ని ముఖ్యమైన సందేశాలు పంపబడ్డాయని జనరల్ విజ్ అన్నారు.
ఇందులో... ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నాయనే వాస్తవం కూడా పాక్ కు పంపించిన సందేశంలో కీలకమైన భాగమని భారత మాజీ ఆర్మీ చీఫ్ అన్నారు. ఫలితంగా... వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడానికి తాము దేనికీ వెనుకాడబోమనే సమాచారం అందిందని అన్నారు. కార్గిల్ జరిగినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్... తనకు కూడా తెలియదని అన్నారని జనరల్ విజ్ గుర్తుచేసుకున్నారు.
అందువల్లే... అసలు పాకిస్థాన్ లో ప్రభుత్వం సైన్యాన్ని నడిపిస్తుందా.. లేక, సైన్యమే ప్రభుత్వాన్ని నడిపిస్తుందా అనేది అస్పష్టంగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... ఈ నెల 10న పాకిస్థాన్ డీజీఎంవో ఫోన్ చేసినప్పుడు మనం స్పందించకుండా ఉండి ఉంటే.. భారత్ ఏ మేరకు అయినా వెళ్లి ఉండేదని మాజీ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఏ సైనికుడికీ యుద్ధం ఒక ఎంపిక కాదు కానీ.. యుద్ధం అనేది అవతలి వ్యక్తిని సహేతుకమైన అవగాహన స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
