Begin typing your search above and press return to search.

పేరు అడిగిన కలెక్టర్ కు పిల్లాడు అడిగింది తెలిస్తే అవాక్కే

ఇందులో ఒక పిల్లాడిని నీ పేరేంటి? అని అడిగితే.. ఆ గడుగ్గాయి అనూహ్య రీతిలో స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది.

By:  Tupaki Desk   |   25 July 2025 10:50 AM IST
పేరు అడిగిన కలెక్టర్ కు పిల్లాడు అడిగింది తెలిస్తే అవాక్కే
X

అక్కడి పిల్లల వయసు ఐదేళ్లలోపే ఉంటారు. అయితే.. మాత్రం మహా హుషారుగా ఉన్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించే క్రమంలో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.. ఒక అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లారు. ఇలాంటి వేళ ఆయనకు ఒక అనూహ్య పరిణామం ఎదురైంది. ఆ మాటకు వస్తే.. చదివే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిణామాన్ని అస్సలు ఊహించలేరు. ఈ కారణంగానే ఇదో వార్తగా మారింది.

తమ వద్దకు వచ్చిన పెద్దాయన ఎవరో ఆ చిన్నారులకు తెలీకున్నా.. అంగన్ వాడీ టీచర్ సంధ్య వ్యవహారశైలిలో వచ్చిన మార్పునకు అనుగుణంగా.. చాలా వినయంగా గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్వాగతం పలికారు. పిల్లలతో కలిసి పోయిన కలెక్టర్.. అక్కడున్న వివిధ బొమ్మల్ని చూపిస్తూ..వాటి పేర్లు అడగటం.. వారు సైతం ఎలాంటి తడబాటుకు లోను కాకుండా అడిగిన ప్రశ్నకు అడిగినట్లుగా సమాధానాలు ఇస్తున్నారు.

దీంతో ముచ్చట పడిన కలెక్టర్.. అక్కడున్న చిన్నారుల పేర్లను ఒక్కొక్కరిగా అడగటం మొదలు పెట్టారు. ఇందులో ఒక పిల్లాడిని నీ పేరేంటి? అని అడిగితే.. ఆ గడుగ్గాయి అనూహ్య రీతిలో స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. తాను పేరు చెప్పాలంటే తనను ఎత్తుకోవాలని..అప్పుడు మాత్రమే తాను పేరు చెబుతానని చెప్పటంతో.. ఆ పిల్లాడి తీరుకు నవ్వేసిన కలెక్టర్.. అప్యాయంగా ఆ చిన్నారిని ఎత్తుకున్నాడు. దీంతో ఆ పిల్లాడు తన పేరు చెప్పేశాడు.

దీంతో.. అక్కడున్న వారు ఈ సరదా సన్నివేశాన్ని క్లిక్ చేశారు. ఆ పిల్లాడి హుషారుకు అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సూర్యాపేట జిల్లాలోని గుండ్ల సింగారంలో కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడికి సమీపంలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని చూసొద్దామని వెళ్లిన కలెక్టర్ కు ఈ అనూహ్య పరిణామం ఎదురైంది. పిల్లల చురుకుదనం.. అడిగిన ప్రశ్నలకు ఇట్టే సమాధానం చెప్పేస్తున్న తీరుతో అంగన్ వాడీ టీచర్ సంధ్యను అభినందించారు. అదే సమయంలో జెన్ అల్ఫా తరం ఎలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పాలి. అన్నట్లు జెన్ అల్ఫా తరం అంటే తెలుసుగా? 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వారిని జెనరేషన్ అల్ఫాగా వ్యవహరిస్తున్నారని.

అదే సమయంలో జెన్ జి తరం గురించి ఇటీవల కాలంలో ఎక్కువ జరుగుతోంది. వీరిని ఎలా గుర్తిస్తున్నారంటే.. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిని జెన్ జీగా అభివర్ణిస్తున్నారు. వీరు సాంకేతికతతో పెరగటంతో పాటు ఆన్ లైన్ లో ఎక్కువ సమయాన్ని గడపటం.. సోషల్ మీడియా వీరికి ముఖ్యమైనది.. వారి ఆలోచనల్ని.. అభిప్రాయల్ని ఇది ప్రభావితం చేస్తుంది. డబ్బుల విషయంలో వీరికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయన్నది తెలిసిందే.

ఇక.. జెన్ అల్ఫా తరం విషయానికి వస్తే.. సాంకేతికంగా చాలా అనుభవజ్ఞులు, స్వతంత్రులుగా చెబుతున్నారు. సామాజికంగా చైతన్యవంతులుగా ఉంటారు. డిజిటల్ ప్రపంచంలో పెరిగారు. టెక్నాలజీతో పరిచయం ఎక్కువ. సామాజిక సమస్యలపై అవగాహన ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.కొవిడ్ ద్వారా ఎక్కువగా ప్రభావితమైన తరం. జెన్ అల్ఫా తరం ప్రపంచాన్ని మార్చటానికి సిద్ధంగా ఉంటుందని చెబుతారు.