Begin typing your search above and press return to search.

గీతాంజలి కేసు... టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్!

తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 March 2024 4:13 AM GMT
గీతాంజలి కేసు... టీడీపీ సోషల్  మీడియా కార్యకర్త అరెస్ట్!
X

తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో తనకు ఎంతో లబ్ధి చేకూరిందని.. ఇందులో భాగంగా అమ్మఒడితో పాటు ఇంటిపట్టా కూడా వచ్చిందని ఆమె తన ఆనందాన్ని వెల్లడించింది. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా టార్గెట్ మొదలైంది.. ఆమెను ఒక వర్గం సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆమె పొందిన లబ్ధిని బహిరంగంగా చెబుతూ హర్షం వ్యక్తం చేయడాన్ని తట్టుకోలేని వారే ఆమెను ట్రోలింగ్స్ చేశారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ సమయంలో ఇది పూర్తిగా టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా జనాలు ఆమెను టార్గెట్ చేశారని, వల్గర్ గా ఆమెపై పోస్టులు పెట్టారని వైసీపీ ఆరోపించింది. రైల్వే పోలీసులు ఆమె శవపంచనామాలో కూడా ఈ విషయాన్ని ప్రస్థావించారని వార్తలొచ్చాయి.

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్ట్ అయ్యారని తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా రాంబాబు పేరున ఉన్న అకౌంట్ నుంచి గీతాంజలిపై అసభ్యకరమైన పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో... గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండ ఉమ అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్ట్ అయ్యాడని.. విజయవాడ సింగ్ నగర్లో అతడిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేసినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సందర్భంగా.. గీతాంజలిపై అసభ్యకరంగా స్పందిస్తూ అతడు చేసిన పోస్టులు, బోండా ఉమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో... గీతాంజలి ఆత్మహత్య కేసులో మొదటి అరెస్ట్ జరిగినట్లయ్యింది!

కాగా... గీతాంజలి ఆత్మహత్య అనంతరం స్పందించిన గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ... రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా ఆమె మనస్థాపానికి గురైనట్లు తేలిందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఆయన... ఈ మేరకు డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.!