గుంటూరులో జీబీఎస్ టెన్షన్.. ఆస్పత్రిలో ఏడుగురు రోగులు?
ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలుడు మరణించగా, తాజాగా గుంటూరులోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
By: Tupaki Desk | 14 Feb 2025 12:50 PM ISTఏపీలో జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాలో ఓ బాలుడు మరణించగా, తాజాగా గుంటూరులోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం ఏడుగురు రోగులు జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఏపీలో టెన్షన్ ఎక్కువవుతోంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రమవుతుండగా, మరోవైపు జీబీఎస్ కేసులు వెలుగు చూడటంతో ప్రజలు ఆందోళన చెబుతున్నారు.
కరోనా మహమ్మారి పీడకలలా వెండాతుండగా, కొత్త వైరస్ జీబీఎస్ కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని పుణేలో 172 మందికి జీబీఎస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఏపీలో ఆ వ్యాధి లక్షణాలు లేవని ప్రజలు ఊపిరిపీల్చుకునేంత లోగానే పంజా విసురుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో జీబీఎస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఏడుగురు బాధితులు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఒకరిని వెంటిలేటర్ పై, మరొకరని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగిలిన ఐదుగురు సాధారణ వార్డులో వైద్యం పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వ్యాధి లక్షణాలతో దేశంలో ఏడుగురు మరణించారు. ఇందులో మన రాష్ట్రంలోనే ఒక మరణం సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల చిన్నారి జీబీఎస్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళకరంగా మారింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. అయితే జీబీఎస్ తో పెద్దగా ఇబ్బంది లేదని, వ్యాధి లక్షణాలపై ఎవరూ భయపడొద్దని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కాళ్లు, చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణి యశస్వి సూచించారు. జీబీఎస్ వైరస్ కి వైద్యం అందుబాటులో ఉందని, రోగులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆమె ధైర్యం చెప్పారు.
