గాజాను కబ్జా చేసేస్తాం: నెతన్యాహూ.. మ్యాప్ లో ‘పాలస్తీనా’ ఉండదిక?
మిలిటెంట్ సంస్థ హమాస్‌పై ఏడాదిన్నరకు పైగా యుద్ధం సాగిస్తోంది ఇజ్రాయెల్. దీనికి అంతం ఎప్పుడో తెలియని పరిస్థితి.
By: Tupaki Desk | 19 May 2025 7:59 PM ISTమిలిటెంట్ సంస్థ హమాస్‌పై ఏడాదిన్నరకు పైగా యుద్ధం సాగిస్తోంది ఇజ్రాయెల్. దీనికి అంతం ఎప్పుడో తెలియని పరిస్థితి. అయితే, కొన్నిరోజుల నుంచి గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. రోజుకు సగటున వందమందిని హతమారుస్తోంది. ఇప్పుడు ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఏకంగా సంచలన ప్రకటన చేశారు. ఓవైపు తీవ్ర స్థాయి దాడుల మధ్యనే.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామన్నారు. గాజా, దక్షిణ-ఉత్తర గాజా, ఖాన్ యూనస్, రఫా, గాజాలోని ప్రాంతాలు. ఈ ప్రాంతం మొత్తం దాదాపు 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు (365 చదరపు కిలోమీటర్ల మేర) విస్తరించి ఉంటుంది అంతే. ఇందులోనే 23 లక్షల మంది నివసిస్తున్నారు. ఇంత చిన్న ప్రాంతంలో ఎక్కువమంది ప్రజలు ఉండడంతో ఇది ప్రపంచలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతంగా మారింది.
రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గాజాను మొత్తం తరలిస్తామని.. పునర్ నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గాజావాసులకు సిరియాలో ఆశ్రయం ఇస్తారని కూడా కథనాలు వచ్చాయి. తాజాగా పశ్చిమాసియా పర్యటనలోనూ ట్రంప్.. గాజా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహూ కూడా గాజా స్వాధీనం గురించి వ్యాఖ్యానించారు. గాజాపై దాడులను తీవ్రం చేసిన ఆయన.. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించలేదనే కారణాన్ని చూపుతున్నారు. గత శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్. దీంతో ఖాన్ యూనిస్‌లో 29, ఉత్తర గాజాలో 48, జబాలియా శరణార్థి శిబిరంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు గాజాలోని రెండో అతి పెద్ద నగరం ఖాన్ యూనిస్, దాని సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఆదేశించింది. ప్రమాదకర పోరాట ప్రాంతాలుగా వీటిని పేర్కొంది. ఇక శాంతి చర్చలకు వేదికైన దోహాలో ‘హమాస్ బహిష్కరణ’ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తెచ్చిందని.. దీని అర్థం గాజా నుంచి హమాస్ వైదొలగాలని అని చెబుతున్నారు. అప్పుడే యుద్దం ఆగుతుందని అంటున్నారు. అయితే, గాజా వదిలేందుకు, ఆయుధాల అప్పగింతకు హమాస్ ఒప్పుకోలేదు.
గాజాను గనుక ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటే పాలస్తీనా అనే పరిశీలన దేశం లేకుండా పోతుంది. ఐక్యరాజ్య సమితి అబ్జర్వర్ కంట్రీ పాలస్తీనా. గాజాతో పాటు వెస్ట్‌బ్యాంక్ కలిపి పాలస్తీనాగా పరిగణిస్తారు. వెస్ట్ బ్యాంక్‌లో ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్రమణలు ఉన్నాయి. ఇప్పుడు గాజానూ ఆక్రమిస్తే ఇక ప్రపంచ పటంలో పాలస్తీనా ఉండదనే అనుకోవాలి.
