ఆగని మారణహోమం.. ఆహారం కోసం వెళుతున్న వారిపై కాల్పులు
గాజాలోని పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 4 Jun 2025 9:44 AM ISTగాజాలో దారుణం.. ఇజ్రాయెల్ దుర్మార్గం లాంటి పెద్ద స్టేట్ మెంట్లను ఇట్టే ఇచ్చేయటం ఇష్టం లేదు. గాజాలో జరుగుతున్నది తప్పా? ఒప్పా? అన్నది ఇక్కడ చెప్పట్లేదు. కేవలం జరుగుతున్న ఘటనల్ని చెప్పటం మాత్రమే లక్ష్యం. జరుగుతున్న పరిణామాలు.. అందులోని వేదనను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక దేశం మీద కోపం ఉండొచ్చు. దాని విధానాలతో నష్టం వాటిల్లిన వేళ.. తగినరీతిలో బుద్ధి చెప్పటం కోసం అమాయక ప్రాణాల్ని బలి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పాలకులకు తగినశాస్తి చేయటం.. వారిని నుంచి అధికారాన్ని దూరం చేస్తే సరిపోతుంది. కానీ.. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా అమాయక ప్రాణాల్ని తీయటమే కనిపిస్తుంది.
గాజాలోని పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్లే వారిని లక్ష్యంగా తీసుకొని కాల్పులు జరపగా.. అందులో 27 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు.. ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. గడిచిన మూడు రోజుల్లో ఇది మూడో కాల్పుల ఘటన కావటం గమనార్హం. కాల్పుల నేపథ్యంలో బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆసుపత్రులకు తరలిస్తూ ఉండటం.. నేల మీద పడిన పిండి సంచులు రక్తపు మరకలతో తడిచి ఉండటం.. లాంటి భీతావహా ద్రశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆహార పంపిణీ కేంద్రం వద్ద తాము చెప్పిన దారిలో కాకుండా.. తమ బలగాల వైపు వస్తున్న అనుమానితుల్ని మాత్రమే తాము కాల్చినట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. కాల్పులకు ముందుగా వార్నింగ్ కాల్పులు చేపట్టామని.. అయినా వారు తమ తీరు ఆపలేదంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏ మాత్రం తీర్చలేనివిగా ఉన్నాయి. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహారపదార్థాలు అందేవి.. వీరికి ఆ ఆహారమే ఆధారం..అయితే.. ఇజ్రాయెల్ సైన్యం నెలల తరబడి ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయటంతో ఆహార నిల్వలు పూర్తిస్థాయిలో అడుగంటాయి.
