పార్లే-G ప్యాకెట్ ధర రూ.2,342.. గాజాలో తీవ్రమైన ఆహార సంక్షోభం
దీనికి తాజా నిదర్శనం, భారతదేశంలో కేవలం రూ.5 విలువ చేసే పార్లే-G బిస్కట్ ప్యాకెట్ గాజాలో ఏకంగా రూ.2,342కి అమ్ముడవుతుండటం
By: Tupaki Desk | 7 Jun 2025 9:00 AM ISTగాజాలో మానవతా సంక్షోభం, ముఖ్యంగా ఆహార కొరత, ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దీనికి తాజా నిదర్శనం, భారతదేశంలో కేవలం రూ.5 విలువ చేసే పార్లే-G బిస్కట్ ప్యాకెట్ గాజాలో ఏకంగా రూ.2,342కి అమ్ముడవుతుండటం. ఈ ఒక్క ఉదాహరణే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది.
తాజాగా తన కొడుకుకు ఇష్టమైన బిస్కట్ల కోసం 24 యూరోలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,342) ఖర్చు చేశానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది గాజా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పడుతోంది.
కనీస అవసరాలైన ఆహార పదార్థాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గాజాలో కిలో షుగర్ రూ.4,914, లీటర్ వంట నూనె రూ.4,177, కిలో ఆలుగడ్డలు రూ.1,965, ఉల్లిపాయలు రూ.4,423, ఒక కప్పు కాఫీ రూ.1,800 పలుకుతున్నాయి. ఈ ధరలు చూస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో స్పష్టంగా అర్థమవుతుంది.
గాజాలో ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరడం, ప్రాథమిక ఆహార పదార్థాలు కూడా అందుబాటులో లేకపోవడం లేదా వాటి ధరలు అసాధారణంగా పెరగడం అక్కడి ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభంపై దృష్టి సారించి తక్షణమే సహాయం అందించాల్సిన ఆవశ్యకత ఉంది.
