Begin typing your search above and press return to search.

'బ్రెడ్ బదులు ఇసుక తింటున్నాం'... గాజా బాలుడి వీడియో వైరల్!

అవును... గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 12:43 PM IST
బ్రెడ్ బదులు ఇసుక తింటున్నాం... గాజా బాలుడి వీడియో వైరల్!
X

హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేకార్యక్రమంలో ఉన్న ఇజ్రాయెల్... గాజాను గడగడలాడించేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అద్భుతంగా కనిపించిన ఆ నగరం ఇప్పుడు శిథిలమైపోయిన భవనాల కాంక్రీట్ కుప్పలతో నిండిపోయింది. ఇక అక్కడి ప్రజల పరిస్థితి రోజు రోజుకీ మరింత దయనీయంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఓ బాలుడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అక్టోబర్‌ లో తమ పౌరులను హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోసిన పనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య.. గాజా భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఈ దాడులు సుమారు ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో అక్కడి పౌరుల జీవితాలు అత్యంత దయనీయంగా మారిపోయాయి. ప్రస్తుతం, ఇజ్రాయెల్ పరిమిత మొత్తంలో ఆహారం, మందులను మాత్రమే అనుమతిస్తుంది. ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. ఇటీవల ఆహార వాహనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ సైనిక దళాలు కాల్పులు జరిపిన పరిస్థితి.

ఈ సందర్భంగా సుమారు 70 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... గాజాలో ప్రజలు ఆహారం లేకపోవడంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో.. గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఒక చిన్నారి వీడియో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఆ బాలుడు ఆహారం కోసం ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. ఇది చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజాలో తమకు తినడానికి ఆహారం లేదని.. ప్రతిరోజూ ఆహారం, ఇతర సామాగ్రితో ట్రక్కులు గాజాలోకి వస్తాయని.. కానీ మాకు దాని నుండి ఏమీ లభించడం లేదని ఆ బాలుడు వీడియోలో అన్నాడు.

ఇదే సమయంలో... 'మేము తిండి లేక ఇసుక తింటున్నాము.. మాకు తిండి లేదు.. ఎక్కడా ఆహారం లేదు.. వంట చేయడానికి పిండి కావాలి.. మాపై దయ చూపండి.. దయచేసి కరుణించండి.. మాకు తిండి లేదు.. మేము రొట్టెకు బదులుగా ఇసుక తింటున్నాము.. దయచేసి కాస్త కరుణ చూపండి..' అంటూ ఆ బాలుడు ప్రపంచాన్ని వేడుకుంటున్నాడు.