Begin typing your search above and press return to search.

అమెరికా బాంబును వాడి గాజా కేఫ్ పై ఇజ్రాయెల్ దాడి.. కలకలం!

యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ చాక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా చట్టవిరుద్ధ చర్య అని విమర్శించారు.

By:  Tupaki Desk   |   3 July 2025 10:43 PM IST
అమెరికా బాంబును వాడి గాజా కేఫ్ పై ఇజ్రాయెల్ దాడి.. కలకలం!
X

గాజా నగరంలోని అల్ బాఖా కేఫ్‌పై ఇటీవల జరిగిన వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. సాధారణంగా ప్రజలు విశ్రాంతి తీసుకునే ఈ సముద్రతీర కేఫ్‌పై ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో అమెరికాలో తయారైన 230 కిలోల ఎంకే 82 బాంబును ఉపయోగించినట్లు నిపుణులు గుర్తించారు. అంతర్జాతీయ మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించడంతో, యుద్ధ నేరాలపై చర్చ మళ్లీ తీవ్రమైంది.

-బాంబు తీవ్రతపై నిపుణుల ఆందోళన

ఈ భారీ బాంబు వాడకంపై హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెందిన గెర్రీ సింప్సన్ తీవ్రంగా స్పందించారు. ఇది "విచక్షణారహిత చర్య" అని పేర్కొంటూ, ఈ దాడిలో ఎక్కువగా పౌరులే మరణించారని, వీటిని చట్టవిరుద్ధ చర్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, జెనీవా ఒప్పందం ప్రకారం పౌరులపై ఇటువంటి బాంబుల వాడకాన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని ఆయన గుర్తుచేశారు.

యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ చాక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా చట్టవిరుద్ధ చర్య అని విమర్శించారు.

కేఫ్‌పై దాడి సమయంలో ఏం జరిగింది?

గాజా సిటీ పోర్ట్ ప్రాంతంలోని ఈ కేఫ్‌ సముద్రతీరంలో ఉండి, ఇంటర్నెట్ ఉపయోగించుకోవడానికి, ఫోన్‌లు ఛార్జ్ చేసుకోవడానికి జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సోమవారం జరిగిన దాడి సమయంలో కూడా అక్కడ దాదాపు 100 మందికి పైగా ఉండగా, ఇజ్రాయెల్ ఒక్క హెచ్చరిక లేకుండా బాంబు విసిరిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "భూమి కంపించినట్టుగా అనిపించింది," అని వారు వివరించారు. ఈ దాడిలో కనీసం 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

-గాజాలో కొనసాగుతున్న మానవ విపత్తు

ఈ ఒక్క ఘటనే కాదు, గాజాలో ఒక్క రాత్రిలోనే 82 మంది మృతిచెందారని హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 38 మంది మానవతా సహాయం కోసం వేచి చూస్తున్నవారని ఆరోపణ. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 57,000 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనతో మరోసారి యుద్ధ నైతికత , మానవ హక్కులు అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శక్తివంతమైన ఆయుధాలను జనజీవితానికి మధ్యన వాడటం వల్ల జరిగే నష్టం అంతులేనిది.