Begin typing your search above and press return to search.

భూమ్మీద గాజా అనే జాగా లేకుండా.. ఇజ్రాయెల్ విధ్వంసం.. ట్రంప్ కోసం?

ఇదంతా భూమ్మీద ప్రస్తుతం నరకంగా భావిస్తున్న గాజా పరిస్థితి.. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల అనూహ్య దాడి తర్వాత అత్యంత దారుణమైన వాతావరణంలో చిక్కుకుంది.

By:  Tupaki Desk   |   8 April 2025 12:50 PM IST
Israel High Attack In gaza
X

కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 లక్షల మంది ప్రజలు.. ఉపాధి అవకాశాల మాట దేవుడెరుగు.. కనీసం తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి.. దీనికితోడు అత్యంత పేదరికం.. అదీ కాకుండా మిలిటెన్సీ.. తమ సొంత భూమిని కాపాడుకునేందుకు ఆయుధాలు పట్టిన వారిని మిలిటెంట్లు అని.. వారి హింసాకాండను వ్యతిరేకించే వాళ్లు టెర్రరిస్టులని అంటుంటారు.

ఇదంతా భూమ్మీద ప్రస్తుతం నరకంగా భావిస్తున్న గాజా పరిస్థితి.. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల అనూహ్య దాడి తర్వాత అత్యంత దారుణమైన వాతావరణంలో చిక్కుకుంది. తరచూ ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజలు ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని లక్షల మంది ఇలా తమ శిబిరాలను మార్చకున్నారు.

గాజా, రఫా, ఖాన్ యూనిస్, డేర్ అల్ బలాహ్.. ఇవీ గాజాలోని ప్రాంతాలు. అయితే, ఇజ్రాయెల్ దాడులతో చాలా భూభాగం రక్తసిక్తమైంది. చాలావరకు ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది.

ఇప్పుడు గాజాను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. శ్మశానంగా మార్చేసి.. పాలస్తీయన్లను వెళ్లగొట్టే ప్రణాళికలో ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

బహుశా ట్రంప్ ఉద్దేశాల మేరకే గాజాలో వసతులు అన్నిటినీ

ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి గాజాకు మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న ఆ కాస్త వాటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోందట.

పంట పొలాలను నాశనం చేసి.. భవనాలను కూల్చివేసి.. ప్రజలు వెళ్లిపోయేలా చేసి.. గాజాను పూర్తిగా నిర్మూలించే ప్రణాళిక అన్నమాట. ఒకవేళ తిరిగి వచ్చినా గాజా ప్రజలు మళ్లీ వసతులను వాడుకోలేనంతగా ధ్వంసం చేస్తోందని సాక్షాత్తు ఇజ్రాయెల్ సైనికులు ఐదుగురు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

2023కు ముందు.. ఇప్పటికి చూస్తే గాజాలో సగం ఇజ్రాయెల్ కంట్రోల్ లోకి వచ్చింది. ఇపుడు ఆ భూమిని మిలటరీ బఫర్ జోన్ గా సైన్యం మార్చేస్తోంది. హమాస్ ను ఓడగొట్టి గాజాపై భద్రతను కంట్రోల్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పారు.

గాజాల ప్రజలు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగలదని.. వారు ఎప్పటికీ తిరిగి రాలేరని విధ్వంసంలో పాల్గొంటున్న ఓ సైనికుడు తెలపడం గమనార్హం. గాజా నేల బీడుగా మారిపోతోందని వ్యాఖ్యానించాడు.

అది బఫర్ జోన్ కాదు కిల్ జోన్..

గాజా ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోగా ఆ ప్రదేశాలను బఫర్ జోన్ లుగా మార్చిన ఇజ్రాయెల్ సైన్యం.. అక్కడి నీరు, నేల, చెట్టు, చేమను నాశనం చేసింది. ఇపుడు అదొక కిల్ జోన్. ఎందుకంటే.. తమపై దాడిచేసిన మిలిటెంట్లనే కాదు.. వారి భార్యలు, పిల్లలతో పాటు పిల్లులు, కుక్కలనూ చంపుతున్నారు ఇజ్రాయెల్ సైనికులు.