Begin typing your search above and press return to search.

గాజాలో మానవత్వానికి అగ్నిపరీక్ష

అమెరికా, ఇజ్రాయెల్‌ మద్దతుతో స్థాపించబడిన గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) గాజాలోని నిస్సహాయ ప్రజలకు ఆహారం అందించేందుకు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   4 July 2025 6:45 PM IST
గాజాలో మానవత్వానికి అగ్నిపరీక్ష
X

ఇజ్రాయెల్-గాజా మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా.. గాజా ప్రజలు తీవ్ర మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కనీసం ఆహారం కోసం కూడా అష్టకష్టాలు పడుతున్న వేళ సహాయ కేంద్రాల వద్ద జరుగుతున్న కాల్పులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఓ మాజీ సెక్యూరిటీ కాంట్రాక్టర్ చేసిన సంచలన ఆరోపణలు ఈ పరిస్థితికి కొత్త కోణాన్ని జోడించాయి.

-మహిళలు, చిన్నారులపై కూడా కాల్పులా?

అమెరికా, ఇజ్రాయెల్‌ మద్దతుతో స్థాపించబడిన గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) గాజాలోని నిస్సహాయ ప్రజలకు ఆహారం అందించేందుకు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేంద్రాల వద్దకు ఆహారం కోసం వచ్చిన మహిళలు, వృద్ధులు, పిల్లలపై కూడా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని సదరు కాంట్రాక్టర్ వెల్లడించారు. "ఆ ప్రజలు ఎవరికీ ముప్పు కలిగించలేదు. వారు ఆకలితో వచ్చారు. కానీ తిరిగిపోకుంటే కాల్చేస్తామన్న హెచ్చరికలతో వారిని పొట్టన పెట్టుకున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- GHF వివరణ

ఈ ఆరోపణలపై GHF స్పందిస్తూ వాటిని పూర్తిగా ఖండించింది. "పౌరులపై తాము ఎటువంటి దాడులు జరపలేదు. మేము ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం, కొంతమంది వ్యక్తులు అధిక ఆహారం అందుకోవాలన్న ఉద్దేశంతో సిబ్బందిపై ఆయుధాలతో దాడి చేయడానికి యత్నించారు. వారిని ఆపేందుకు మేము ఎదురుకాల్పులు చేపట్టాల్సి వచ్చింది" అని వారు వివరించారు.

అయితే, ఈ కాల్పుల కారణంగా చిన్నారులు, వృద్ధులు గాయపడినట్లు వారు అంగీకరించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక ఆహారం కోసం నిర్ణీత మార్గం కాకుండా పక్కదారుల్లోకి వెళ్తుండటంతో ఇజ్రాయెల్ సైన్యం వారిని నియంత్రించేందుకు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనల్లో ప్రాణనష్టం లేదని స్పష్టం చేస్తూ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

ప్రాణాలకు భద్రత లేకుండా మారిన ఆహార యాత్ర

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా ప్రజలు ఆహారం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బయటకు రావాల్సి వస్తోంది. ప్రస్తుతం గాజాలోకి చేరుతున్న సాయం మొత్తం GHFకి చెందిన కేవలం నాలుగు పంపిణీ కేంద్రాలకే పరిమితమైంది. ఇవి ఇజ్రాయెల్ మిలిటరీ జోన్లలో ఉన్నందున సాధారణ పౌరులకు చేరుకోవడం అత్యంత కష్టంగా మారింది. అత్యల్ప సాయం మాత్రమే కొన్ని గ్రూపులకు చేరుతుండటంతో తీవ్ర తొక్కిసలాటలు జరుగుతున్నాయి.

గాజాకు చెందిన మహమ్మద్ సాఖెర్ అనే పౌరుడు మాట్లాడుతూ "ప్రతిసారీ నా ముగ్గురు పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయలుదేరితే మా తలపై కాల్పులు జరుగుతున్నాయి. డ్రోన్లు మనల్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరిస్తున్నాయి" అని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

-మానవత్వానికి ఇదే పరీక్ష!

ఈ ఉదంతాలు గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. సాయం పేరుతోనే ప్రజలపై దాడులు జరిగితే, అది మానవత్వానికి తీరని అవమానంగా నిలుస్తుంది. అన్ని ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు, పారదర్శక నివేదికలు, మానవ హక్కుల పరిరక్షణ ఇప్పుడు అత్యవసరం. గాజా ప్రజల ఆకలి కేకలు ప్రపంచ మనసులను కదిలించాలి. సాయం పేరుతో వారి ప్రాణాలు తీసే దారుణానికి ముగింపు తెచ్చే దిశగా ప్రపంచ దేశాలు చొరవ చూపాలి.