Begin typing your search above and press return to search.

బెంగళూరు ఘటనపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాలో ఉన్నప్పటి నుంచీ గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అందుకే అతను కెప్టెన్ కాలేకపోయారు అనే అభిప్రాయం ఉంది

By:  Tupaki Desk   |   5 Jun 2025 9:22 PM IST
బెంగళూరు ఘటనపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
X

టీమిండియాలో ఉన్నప్పటి నుంచీ గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అందుకే అతను కెప్టెన్ కాలేకపోయారు అనే అభిప్రాయం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, కోచ్‌గా కొత్త అవతారం ఎత్తినప్పటికీ, అతను తన ముక్కుసూటితనాన్ని వదులుకోలేదు. టీమిండియా గెలుస్తున్నా, ఓడిపోతున్నా, తనపై విపరీతమైన ఒత్తిడి ఉన్నా, గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కీలక విషయాలపై మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. సీనియర్ ఆటగాళ్లు, మాజీలు స్పందించకపోయినా.. టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటనపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తను కోచ్ అనే విషయాన్ని పక్కన పెట్టి, ఒక మనిషిగా స్పందించారు.

ఇటీవల టెస్ట్ జట్టును ఎంపిక చేసినప్పుడు, అందులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు కల్పించకపోవడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు, "కోచ్‌లు ఆటగాళ్లకు స్థానం లేదా స్థానం లేకుండా చేయరు" అని స్పష్టం చేశారు. అలాంటి గౌతమ్ గంభీర్ కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న దారుణంపై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. ఏం జరుగుతుందో, ఏం జరగాలో అనే విషయాలను, ఒక కోచ్ అనే సందర్భాన్ని పక్కన పెట్టి, ఒక మనిషిగా స్పందించారు.

గంభీర్ మాట్లాడుతూ "రోడ్ షోలు, విక్టరీ పరేడ్‌లు అవసరం లేదు. 2007లో భారత జట్టు విశ్వవిజేత అయినప్పుడు ఇలానే చెప్పాను. అభిమానులు భారీగా వస్తే పరిస్థితులు చేయి దాటిపోతాయి. అప్పుడు అనుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. కర్ణాటక రాజధానిలో జరిగిన ఘటన అత్యంత దారుణమైనది. అసలు ఇటువంటి సంఘటన జరగాలని ఎవరూ కోరుకోరు. ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. అక్కడ దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ఇటువంటి ఘటనలకు అందరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా చూడాలి. ఇలాంటివి జరిగితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, తదుపరి జరిగే పరిణామాలు కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్ల మీద అభిమానం తగ్గిపోతుంది. ఆటగాళ్ల మీద నమ్మకం పోతుంది. అది ఆటకు అసలు మంచిది కాదని" అభిప్రాయపడ్డారు.

2007లో పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పుడు, ధోని భారత జట్టుకు సారథ్యం వహించారు. 2007లోనే ఐసీసీ పొట్టి ఫార్మాట్‌ను అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేసింది. ఆ సమయంలో బీసీసీఐ భారీగా విజయ యాత్ర నిర్వహించాలని అనుకున్నది. కానీ భారీగా అభిమానులు వస్తే పరిస్థితి కట్టుతప్పుతుందని అందరూ భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. అదే విషయాన్ని గౌతమ్ గంభీర్ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. గత ఏడాది పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచినప్పుడు భారత మేనేజ్‌మెంట్ విజయ యాత్ర నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు. అంతటి భారీ కార్యక్రమం జరిగినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం, భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. కానీ బెంగళూరు విషయంలో మాత్రం అన్నింట్లోనూ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆ సంఘటనలు ఇంతటి దారుణాలకు కారణమయ్యాయి.