ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది?...60,000 సంవత్సరాల నరకం తప్పదా ?
హిందూ మత విశ్వాసాల ప్రకారం మానవ జన్మ లభించడం చాలా కష్టం.
By: Tupaki Desk | 26 May 2025 1:21 AM ISTమనిషి జీవితం దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. కానీ కొన్నిసార్లు మనుషులు ఆ జీవితం విలువను గుర్తించలేక, నిరాశతో ఆత్మహత్య చేసుకుంటారు. అయితే, మన హిందూ మతంలో ముఖ్యంగా గరుడ పురాణం ప్రకారం.. ఆత్మహత్య అనేది ఒక మామూలు పాపం కాదు. అది ఘోరమైన మహాపాపం. ఈ పవిత్ర గ్రంథం ప్రకారం.. జీవితాన్ని మధ్యలోనే ముగించుకునే వారి ఆత్మలు భయంకరమైన శిక్షలను అనుభవిస్తాయి. అసలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక ఆత్మకు ఏమవుతుంది? పునర్జన్మ ఉంటుందా? నరకంలో ఎన్ని వేల సంవత్సరాలు ఉండాలి? ఈ ప్రశ్నలకు గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం మానవ జన్మ లభించడం చాలా కష్టం. ఇది ఎన్నో పుణ్యాల ఫలితం అని చెబుతారు. ఇలాంటి విలువైన మానవ శరీరాన్ని పొందిన తర్వాత, ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకుంటే దానిని దేవుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేయడంగా భావిస్తారు. అందుకే ఆత్మహత్య చేసుకునే వారిని పాపులుగా పరిగణిస్తారు. ఇలాంటి వారు తమ మరణానంతరం చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారని గరుడ పురాణం స్పష్టం చేస్తుంది. మనిషి తన నిర్ణీత జీవిత కాలాన్ని పూర్తి చేయకుండా, మరణ సమయం రాకముందే చనిపోతే, వాటిని 'అకాల మరణాలు'గా పేర్కొంటారు. ఆత్మహత్య కూడా అకాల మరణం కిందకే వస్తుంది.
గరుడ పురాణంలో ప్రతి పాపానికి దాని తగిన శిక్షను వివరంగా వివరించారు. ఆత్మహత్యకు విధించే శిక్షలు వింటే ఎవరైనా భయపడతారు. నిర్ణీత జీవిత కాలాన్ని పూర్తి చేయకుండా చనిపోయిన వారి ఆత్మలు ఏడు జన్మల చక్రాలను పూర్తి చేసే ముందు భయంకరమైన హింసను అనుభవించాల్సి వస్తుంది.గరుడ పురాణం ప్రకారం, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మను మరణానంతరం 13 వేర్వేరు లోకాలకు పంపిస్తారు. ఆత్మహత్య చేసుకున్న వారికి 60,000 సంవత్సరాలు నరకంలో గడపాల్సి వస్తుంది. ఇది ఏడు నరకాలలోకెల్లా అత్యంత భయంకరమైనది. నరకంలో ఆ ఆత్మను విపరీతంగా హింసిస్తారు.సాధారణంగా మరణం తర్వాత 30 లేదా 40 రోజులలోపు ఒక ఆత్మ కొత్త శరీరాన్ని పొందుతుంది. కానీ, ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు అలా కాకుండా అనంతంగా సంచరిస్తూనే ఉంటాయి. వారికి స్వర్గంలో గానీ, నరకంలో గానీ ఎక్కడా చోటు ఉండదు. ఈ ఆత్మలు భూమి, స్వర్గం, నరకం మధ్య ఎటూ కాకుండా తిరుగుతూనే ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది. వారికి ఎప్పటికీ విశ్రాంతి లభించదని దీని అర్థం.
గరుడ పురాణం చెప్పే ఈ విషయాలు జీవిత విలువను, మానవ జన్మ ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆత్మహత్య అనే తప్పుడు నిర్ణయం తీసుకోకుండా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ పురాణం పరోక్షంగా బోధిస్తుంది.
