Begin typing your search above and press return to search.

ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌.. ఇప్పుడు టెర్రరిస్టుని చేసేశారు!

ఈ నేపథ్యంలో రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ అయిన రోస్‌ ఫిన్‌ మానిటరింగ్‌ కొత్తగా విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ ను చేర్చింది.

By:  Tupaki Desk   |   7 March 2024 8:06 AM GMT
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌.. ఇప్పుడు టెర్రరిస్టుని చేసేశారు!
X

తాము కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.. రష్యా అధినేత వాద్లిమిర్‌ పుతిన్‌. అయితే ఆయనకు ఇందుకు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలవుతున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆయన ఉక్రెయిన్‌ పై సాగిస్తున్న యుద్ధంపై ప్రపంచ దేశాల్లోనే కాకుండా రష్యన్లలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తనను, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేతలను, ప్రజలను, వివిధ సం«ఘాల వ్యక్తులను పుతిన్‌ ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వారిపై ఆంక్షలు విధించడం, దాడులు చేయించడం, హత్యకు పాల్పడటం వంటి పనులు చేస్తోందని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఈ నేపథ్యంలో పుతిన్‌ ప్రభుత్వ దాడులను తట్టుకోలేని వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే దేశాలకు వలసపోతున్నారు. మరికొందరు దేశంలోనే ఉంటూ పోరాటం సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న కారణంతో రష్యా ప్రభుత్వం ఒకప్పటి ప్రపంచ చెస్‌ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌ వన్‌ చెస్‌ ప్లేయర్‌ అయిన గ్యారీ కాస్పరోవ్‌ పై కఠిన చర్యలకు దిగింది. ఆయనను ఉగ్రవాదులు, అతివాదుల జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని రష్యా మీడియా వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

60 ఏళ్ల కాస్పరోవ్‌ చెస్‌ క్రీడలో అనేకసార్లు ప్రపంచ ఛాంపియన్‌ గా నిలిచి రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా తన అభిప్రాయాలను బలంగా వ్యక్తీకరిస్తున్నారు. రష్యా అధినేత పుతిన్‌ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేయడాన్ని పలుమార్లు తప్పుబట్టారు.

ఈ నేపథ్యంలో రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ అయిన రోస్‌ ఫిన్‌ మానిటరింగ్‌ కొత్తగా విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ ను చేర్చింది. అయితే ఉగ్రవాదుల జాబితాలో ఆయనను చేర్చడానికి కారణాలేమిటో వెల్లడించలేదు. అయితే ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకే ఆయనను ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాగా ఉగ్రవాదుల జాబితాలో చోటు చేసుకునే వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధిస్తారు. వారి ఖాతాలను ఉపయోగించాలనుకున్న ప్రతిసారి అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.

కాగా గ్యారీ కాస్పరోవ్‌ ప్రస్తుతం రష్యాలో ఉండటం లేదు. ప్రభుత్వ అణచివేతకు భయపడి 2014లోనే ఆయన దేశాన్ని విడిచిపెట్టేశారు. గత పదేళ్ల నుంచి కాస్పరోవ్‌ అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్‌ అనే ముద్ర వేసింది.

కాగా తాజాగా కాస్పరోవ్‌ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చడాన్ని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రత్యర్థుల అణచివేతకు రష్యా ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలను ఆయుధంగా ఉపయోగిస్తోందని మండిపడుతున్నాయి.