Begin typing your search above and press return to search.

గంటా వర్సెస్ అవంతి : భీమిలీలో రసవత్తరమైన పోరు...!

ఇపుడు అసలైన ఘట్టం మొదలైంది. అటు అవంతి ఇటు గంటా ఈ ఇద్దరి మధ్య భీకరమైన పోరు భీమిలీలో సాగనుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 2:15 PM GMT
గంటా వర్సెస్ అవంతి :  భీమిలీలో రసవత్తరమైన పోరు...!
X

విశాఖ జిల్లా భీమిలీ టీడీపీ సీటు ఎవరికి అన్న టెన్షన్ కి తెర పడిపోయింది. ఈ సీటుని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన రాజకీయ చతురతకు మెచ్చాల్సిందే అని ప్రత్యర్ధులు కూడా అంటున్నారు. చంద్రబాబు నిర్ణయం చీపురుపల్లికి గంటాను పంపాలని ఉంది. కానీ అధినాయకత్వాన్ని తనకు అనుకూలంగా చేసుకుని భీమిలీలో గంటా మరోమారు పోటీ చేస్తున్నారు.

ఈ విధంగా ఆయన తొలి విజయం సాధించారు. గంటా 2014లో మొదటిసారి భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆనాడు ఆయనకు పట్టిందల్లా బంగారం అయింది. అయిదేళ్ల పాటు ఆయన మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య భూమికను పోషించారు. భీమిలీ ఆయనకు ఆ విధంగా ఎంతో ఇష్టమైన నియోజకవర్గం అయింది.

గంటా భీమిలీ కోసం 2019లో పట్టుబట్టినా టీడీపీ హై కమాండ్ ఆయనకు విశాఖ ఉత్తరం సీటుని ఇచ్చింది. అప్పట్లో నారా లోకేస్ధ్ భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం ఒక దశలో బలంగా సాగింది. అయితే చివరికి మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలీని కేటాయించారు. ఆయన చివరి నిముషంలో అభ్యర్థి అయినా దాదాపుగా లక్ష ఓట్లను సాధించి వైసీపీ వేవ్ లోనూ తనకు తిరుగులేదు అనిపించుకున్నారు.

ఇక భీమిలీ విషయంలో గంటా పంతం అయిదేళ్ళు ఆలస్యంగా అయినా నెరవేరుతోంది అని అంటున్నారు. గంటాకు భీమిలీలో బలం ఉంది. ఆయన సామాజిక వర్గం అధికంగా ఉంది. గతంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2014లో ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. 37 వేల పైచిలుకు మెజారిటీ గంటా సాధించారు.

ఇదిలా ఉంటే గంటా ప్రత్యర్థిగా ఆయన ఒకనాటి నేస్తం, రాజకీయాల్లో శిష్యుడు అయిన అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. గంటా రాజకీయాల్లోకి అవంతిని తీసుకుని వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా అవంతి 2009లో భీమిలీ నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ఆరు వేలకు పైగా మెజారిటీ దక్కింది.

ఇక 2014లో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినపుడు ఆ తరువాత గంటాతో కలసి అవంతి టీడీపీ లోకి వచ్చారు. 2014లో భీమిలీ టికెట్ నే అవంతి మరోసారి కోరుకున్నా గంటా రాజకీయ పలుకుబడి ఉపయోగించి తాను భీమిలీ టికెట్ సాధించారు. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించారు దాంతో ఆనాటి నుంచి ఇద్దరు మిత్రుల మధ్య గ్యాప్ పెరిగింది. అది కాస్తా 2019 నాటికి మరింతగా పెరిగి అవంతి వైసీపీలోకి జంప్ అయ్యేలా చేసింది.

అవంతి 2009లో భీమిలీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి దాదాపుగా పది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తాను కోరుకున్నట్లుగా మంత్రి కూడా అయ్యారు. మూడేళ్ళ పాటు ఆ పదవిలో ఉన్నారు. గంటాను వీడి సొంత ఇమేజ్ తో రాజకీయం చేసినందుకు అవంతికి దక్కిన ప్రతిఫలం అది అని ఆయన అనుచరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

గంటా చూస్తే 2019లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి జగన్ వేవ్ లో సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన చాన్నాళ్ళ పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరాలని కూడా ప్రయత్నం చేశారు అని ప్రచారం జరిగింది. కానీ అవంతి ఆయన రాకను అడ్డుకున్నారు అని చెబుతారు. మొత్తానికి టీడీపీలోనే ఉండిపోయిన గంటా తాను కోరుకున్న సీటు భీమిలీని కూడా పట్టేశారు.

ఇపుడు అసలైన ఘట్టం మొదలైంది. అటు అవంతి ఇటు గంటా ఈ ఇద్దరి మధ్య భీకరమైన పోరు భీమిలీలో సాగనుంది అని అంటున్నారు. గంటా ఒకసారి ఎంపీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పోటీ చేసిన సీట్లో మళ్లీ పోటీ చేయలేదు. కానీ భీమిలీలోనే రెండవసారి పోటీలో ఉన్నారు. ఆయనకు ఓటమి తెలియదు. అన్ని విజయాలే ఉన్నాయి.

ఇక అవంతి విషయం తీసుకుంటే ఆయన ఒక సారి ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా భీమిలీ నుంచే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన చరిత్ర ఇటీవల కాలంలో ఆయనకే ఉంది. గంటా అవంతి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరూ అంగబలం అర్ధబలం విషయంలో సమానంగానే ఉంటారు ఇద్దరికీ ప్రత్యేక వర్గం ఉంది. భీమిలీలో కాపులతో పాటు బీసీలు యాదవులు, ఇతర వర్గాలు మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ ఇద్దరి పోటీతో భీమిలీ ఏపీలో హాట్ ఫేవరేట్ సీటు గా మారిపోయింది.