Begin typing your search above and press return to search.

బండారు తరువాత అరెస్ట్ ఆయనేనా...?

త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:56 PM GMT
బండారు తరువాత  అరెస్ట్  ఆయనేనా...?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ తరఫున ఎందరో మంత్రులుగా పనిచేశారు. కానీ రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నది ముగ్గురే. వారిలో ఒకరు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మరొకరు గంటా శ్రీనివాసరావు. వీరి మధ్యలో అంటే 1998 ప్రాంతంలో ఒక్కసారి మంత్రి చేశారు బండారు సత్యనారాయణమూర్తి.

ఇలా ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. ఇందులో మొదట అరెస్ట్ చేసింది అయ్యన్నపాత్రుడిని. ఆయన మీద దాదాపుగా పదిహేను కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది అని ఈ మధ్యనే ఆయన చెప్పుకున్నారు అయ్యన్న అరెస్ట్ ని పోలీసులు చూపించినా స్టేషన్ బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు.


ఆయన గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక సందర్భాలలో ప్రభుత్వం మీద విమర్శలతో పాటు జగన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ విధంగా ఆయన మీద పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆయన తరువాత బండారు సత్యనారాయణమూర్తి వంతు వచ్చింది.

బండారు మీడియా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా డోస్ ఎపుడూ ఒక స్థాయిలోనే ఉండేది. అలాంటి బండారు ఇటీవల సడెన్ గా మహిళా మంత్రి రోజా మీద బూతు పురాణంతో రెచ్చిపోయారు. అంతే కాదు జగన్ని పట్టుకుని అనుచితమైన కామెంట్స్ చేశారు. దాంతో ఆయన మీద రెండు కేసులు పెట్టారు పోలీసులు.

ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆదివారం అర్ధరాత్రి ఉమ్మడి విశాఖ జిల్లాలోని వెన్నెలపాలెం లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు దాదాపుగా ఇరవై గంటల తరువాత అరెస్ట్ చేశారు. బండారు ని గుంటూరు తరలించారు. బండారు ఈ కేసు విషయంలో బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇపుడు బండారు తరువాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది విశాఖ జిల్లాలో చర్చకు వస్తోంది. త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు. గంటా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు. అయితే గంటా ఎపుడూ హద్దులు దాటి మాట్లాడినది లేదు.

ఆయన విమర్శలు కూడా హుందాగానే ఉంటాయి. అందువల్ల ఆయన్ని బండారు అయ్యన్న మాదిరిగా ఈ రకమైన కేసులలో అరెస్ట్ చేయడం అయితే సాధ్యం కాదు అనే అంటున్నారు. అయితే గంటా మంత్రిగా ఉన్నపుడు భూ దందాలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద సిట్ విచారణకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆదేశించింది.

అందువల్ల సిట్ నివేదికను బయటకు తీసి గంటాను ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు చూస్తే గంటాకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో ఏమైనా లింకులు ఉన్నాయా అన్నది చూసి అయినా అరెస్ట్ చేయవచ్చు అంటున్నారు. నిజానికి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ మానవ వనరుల శాఖ పరిధిలోకి వస్తుంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రాలో వరసబెట్టి అచ్చెన్నాయుడు నుంచి బండారు దాకా అరెస్టులు అయ్యారు. గంటా మాత్రం మిగిలిపోయారు అంటున్నారు. మరి ఈ మాజీ మంత్రి అరెస్ట్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.