Begin typing your search above and press return to search.

గంటా కార్నర్...ఒంగోలియన్ అంటూ...!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖకు వలస వచ్చిన నేత. ఆ విషయం అందరికీ తెలుసు

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:42 AM GMT
గంటా కార్నర్...ఒంగోలియన్ అంటూ...!
X

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖకు వలస వచ్చిన నేత. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఉద్యోగ వ్యాపారం నిమిత్తం విశాఖకు వచ్చారు. అదృష్టం కలసి వచ్చి రాజకీయంగా వెలుగు వెలిగారు. ఆయన సొంత ప్రాంతం ఒంగోలు. ఆయనది అక్కడ శాశ్వత చిరునామా. గంటా అన్నదమ్ములు కుటుంబం అంతా అక్కడే ఉంటుంది.

అయితే గంటా రాజకీయ కేంద్ర స్థానం మాత్రం విశాఖగా చేసుకున్నారు. గంటా వలస నేత అని సొంత పార్టీలోనూ ప్రత్యర్ధులు చాలా సార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ విషయం ఒక ఎత్తు అయితే ఇపుడు గంటా విశాఖ రాజధాని ఇష్యూలో తలదూర్చి సడెన్ గా ఒంగోలియన్ అయిపోయారు.

ఈ ఒంగోలియన్ ఏంటి అంటే బాలయ్య అదేదే సినిమా ఫంక్షన్ లో చెప్పినట్లుగా ఒంగోలు బ్యాచ్ అన్న మాట. గంటా యాభై లక్షల విశాఖ జిల్లా ప్రజానీకం తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ విశాఖ రాజధాని ఎవరికీ ఇష్టం లేదు అనేశారు. ప్రజలు వద్దు అనే అంటున్నారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు విశాఖను ఎందుకు రాజధాని చేయాలని కూడా ఆయన నిలదీస్తున్నారు.

దీంతో మండిన వైసీపీ నేతలు గంటా పుట్టుపూర్వోత్తరాలు బయటపెడుతున్నారు. విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అయితే విశాఖ రాజధాని ఎందుకు అని ప్రశ్నిస్తున్న గంటా ఎక్కడ నుంచి వచ్చారు అని మండిపడుతున్నారు. గంటా ఎవరు విశాఖకు రాజధాని వద్దు అని చెప్పడానికి అని ఫైర్ అవుతున్నారు.

గంటా విశాఖ రాజధాని వద్దు అని చెప్పి మరీ తన మీద పోటీ చేయాలని ఓడించి తీరుతాను అని శపధం చేస్తున్నారు విశాఖ ఉత్తరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి కేకే రాజు. ఆయన 2019లో గంటా మీద పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈసారి తాను తప్పక గెలుస్తానని గంటా తో పాటు చంద్రబాబు వచ్చినా లోకేష్ పోటీ చేసినా తాను రెడీ అంటున్నారు. అయితే విశాఖ రాజధాని వద్దు అని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టి విశాఖ జనాల ఓట్లు అడగాలని సవాల్ చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే గంటా విశాఖ వాసి కాదు అని ఆయన వలసవాసి అంటూ వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. ఇంతకాలం విశాఖవాసుల ఓట్లతో గెలిచి తీరా రాజధాని విశాఖకు ఇస్తామంటే గంటా మోకాలడ్డడం ఏంటని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కూడా గంటా కామెంట్స్ మీద మండిపడుతున్నారు.

రాజధాని వద్దు అని ఎవరో అంటే రాకుండా పోతుందా అని ఆయన తనదైన శైలిలో విమర్శించారు. మొత్తానికి గంటా కేరాఫ్ అని ఒంగోలు అని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. రాజకీయ దూకుడుతో ఎపుడూ వ్యవహరించని గంటా ఇపుడు వైసీపీని గట్టిగానే తగులుకుంటున్నారు. అది కూడా విశాఖ రాజధాని వంటి సెంటిమెంట్ ఇష్యూతో గంటా రాజకీయం చేస్తున్నారు, దీని ఫలితాలు ఎలా ఉంటాయో గంటా వంటి వ్యూహకర్తకు తెలియవా అని అంటున్నారు.