Begin typing your search above and press return to search.

రూరల్ కి గంటా...అయ్యన్నతో తంటా...!?

గంటాకు టికెట్ ఇవ్వవద్దు అన్నది అయ్యన్న డిమాండ్ గా ఉందని చెబుతారు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 3:54 AM GMT
రూరల్ కి గంటా...అయ్యన్నతో తంటా...!?
X

ఉమ్మడి విశాఖ జిల్లా ఉన్నపుడు ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు చింతకాయల అయ్యన్నపాత్రుడులకు చెరో ప్రాంతాన్ని గిరి గీసి మరీ అప్పగించారు చంద్రబాబు. అర్బన్ విశాఖ జిల్లా పార్టీ ప్రభుత్వ బాధ్యతలు అన్నీ గంటా చూసుకుంటే రూరల్ విశాఖ జిల్లాలో హవా అంతా అయ్యన్నదే అని చెప్పేశారు. అయినా సరే గంటా తరచూ నాడు రూరల్ జిల్లా పార్టీ వ్యవహారాలలో తలదూర్చారు అని అయ్యన్న వర్గం కన్నెర్ర చేసేది.

అలా చంద్రబాబు అయిదేళ్ళ పాలన 2014 నుంచి 2019 దాకా సాగినపుడు ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ సాగేది అని ప్రచారంలో ఉంది. ఆఖరుకు నామినేటెడ్ పదవులు కూడా క్యాడర్ కి ఇప్పించుకోలేని విధంగా ఈ ఇద్దరు వైరం సాగింది అని కూడా అంటారు. 2019లో పార్టీ ఓడినా కూడా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ అలాగే ఉంది.

గంటాకు టికెట్ ఇవ్వవద్దు అన్నది అయ్యన్న డిమాండ్ గా ఉందని చెబుతారు. ఆయన అయిదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడలేదని కూడా ఈ మధ్య దాకా ఇండైరెక్ట్ గా సెటైర్లు అయ్యన్న వేస్తూనే ఉన్నారు. ఇక గంటా మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయన చంద్రబాబుతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు.

అదే సమయంలో మెగా ఫ్యామిలీతో ఆయనకు ఉన్న అనుబంధం బలమైన సామాజిక నేపధ్యం, అర్ధబలం, వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ టీడీపీలో కీలకంగా ఉండడం ఇవన్నీ ఆయనకు అనుకూలం అవుతున్నాయి. దాంతో గంటా మరోమారు టికెట్ సాధించేందుకు రెడీ అయ్యారు. అది కూడా తనకు ఇష్టమైన సీటులో.

ఆయన చోడవరం నుంచి మళ్లీ పోటీకి ప్రయత్నాలు మొదలెట్టారు. గంటా 2004లో చోడవరం నుంచి పోటీ చేసారు. గెలిచారు కూడా. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఇక ఆ తరువాత కధ తెలిసిందే.

ఇపుడు అంటే దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ ఆయన చోడవరం వైపు వస్తున్నారు. గంటా చోడవరం నుంచి గెలిస్తే రేపటి రోజున టీడీపీ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కోటాలో మంత్రి పదవికి పోటీదారు అవుతారు. అదే అనకాపల్లి జిల్లాలోని నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న గెలిస్తే ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఇలా ఒకే జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా దక్కుతాయా అన్నది చర్చకు వస్తోంది.