విశాఖ టు విజయవాడ.. వయా హైదరాబాద్.. ఇదేంటి సర్: బాబుకు గంటా ప్రశ్న
ఈ సందర్భంగా మంగళవారం తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకుని.. ఇదేంటో చూడండి సర్! అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
By: Tupaki Desk | 15 April 2025 8:21 PM ISTఉమ్మడి విశాఖ పట్నం జిల్లాలోని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తాజాగా ఓ కీలక విషయంపై అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నా.. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం ఇబ్బంది గానే ఉందన్నారు. ఇది పెట్టుబడులు పెట్టాలనుకునేవారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. విశాఖ నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని.. అక్కడ నుంచి 50 కిలో మీటర్ల దూరంలోని అమరావతికి చేరుకునే అవకాశం లేకపోవడం.. ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మంగళవారం తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకుని.. ఇదేంటో చూడండి సర్! అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మంగళవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకారం.. తాను సీఎం చంద్రబాబును కలవాల్సి ఉందన్న గంటా.. ఈ క్రమంలో విశాఖ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఎక్కినట్టు టికెట్లతోపాటు తెలిపారు. అయితే.. తాను ఉదయం విమానం ఎక్కగా.. అది నేరుగా విజయవాడకు రాకుండా.. హైదరాబాద్‌కు వెళ్లిందని.. అక్కడ నుంచి వేరే ఫ్లయిట్‌లో తాను విజయవాడకు రావాల్సి వచ్చిందన్నారు. తద్వారా... సమయం వృథాతో పాటు..విసుగు కూడా వచ్చిందన్నారు.
గతంలో రెండు విమానాలు నేరుగా విశాఖ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణం చేసేవని.. కానీ, వీటిని కేంద్రం రద్దు చేసిందని గంటా తెలిపారు. దీంతో విశాఖ నుంచి అమరావతికి రావాలని భావించే వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఐటీ నిపుణులు వంటివారు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి.. అటు నుంచి విజయవాడకు వచ్చి..అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజధానికి చేరుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతోందని.. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న రెండు డైరెక్ట్ విమానాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇదిలావుంటే.. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని ఐదు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి భూమి పరిశీలన మంగళవారం ప్రారంభమైంది.