సీనియర్లు ఇలా చేయొచ్చా? గంటాకు హైకమాండ్ క్లాస్
‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.
By: Tupaki Desk | 16 April 2025 5:46 PM ISTటీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్రంలో పెను దుమారం రేపింది. గంటా ప్రకటన మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రభుత్వానికే నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ‘‘ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ’’ అన్న క్యాప్షన్ తో గంటా చేసిన పోస్టింగు వల్ల టీడీపీ కూటమి ప్రభుత్వానికి, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహననాయుడికి చెడ్డపేరు తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన పోస్టింగుపై టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైజాగ్ ప్రాంతంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్న భావన వచ్చేలా గంటా పోస్టింగు ఉందని అంటున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది’’ అంటూ గంటా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉండగా, విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులను రద్దు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కోలా తోచక ప్రభుత్వం సతమతమవుతుండగా, మరింత అగ్గి రాజేసేలా గంటా పోస్టు చేయడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన మీరు ఇలా పోస్టు చేయొచ్చా? అంటూ గంటాను ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది.
