Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి గంటా ఆన్ డ్యూటీ.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   12 Sept 2025 5:23 PM IST
మాజీ మంత్రి గంటా ఆన్ డ్యూటీ.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు
X

కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన విమర్శలను ఖండించేందుకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితి బాగోలేనట్లు ఉందని ఏద్దేశా చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం జగన్ రెండు రోజుల క్రితం విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై కూటమి పెద్దలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుండగా, గంటా ఓ అడుగు ముందుకేసి జగన్ మానసిక పరిస్థితిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.

రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మాజీ సీఎం జగన్ ప్రస్టేషన్ ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి గంటా ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన నుంచి ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని, ఆయన మానసిక పరిస్థితిపై తనకు అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ విజయవంతమైందని, చెప్పిన మాట చేసి చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఆ సభ ఉదాహరణగా ఆయన చెప్పారు.

మాజీ సీఎం జగన్ తీరు చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై జగన్ ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని చెబుతున్న జగన్.. ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని తెలుసుకోవాలని అన్నారు. వైసీపీ హయాంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మించిన వైద్య కళాశాల అసంపూర్తిగా ఉందని చెప్పారు. అప్పట్లో కేవలం 8 శాతం మేర భవనాలను నిర్మించి వదిలేసినట్లు తెలిపారు. జగన్ సీఎంగా ఉండగా, తన పార్టీ కార్యాలయాలు తప్ప మరేమీ నిర్మించలేదని గంటా వ్యాఖ్యానించారు.

‘రూ.55 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ ఖర్చు మెడికల్ కాలేజీలపై పెట్టి ఉంటే అవి పూర్తయ్యేవి. వైసీపీ ఐదేళ్ల పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. గత ప్రభుత్వం కంటే అధిక మొత్తంలో పింఛను అందిస్తున్నాం. దివ్యాంగులకు పింఛను పెంచి ఇస్తున్నాం. విశాఖకు పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. నేపాల్ లో తెలుగు వాళ్లు చిక్కుకుంటే మంత్రి నారా లోకేశ్ నిరంతరం పర్యవేక్షించి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు’ అని గంటా చెప్పారు.