గంటాకి సూపర్ పోస్టుని రెడీ చేసి ఉంచారా ?
ఇక గంటా చూస్తే గతానికి భిన్నంగా జోరు చేస్తూ వస్తున్నారు తన సొంత నియోజకవర్గం భీమిలీలో ఆయన వరసగా పర్యటనలు చేస్తున్నారు.
By: Satya P | 17 Jan 2026 1:00 PM ISTవిశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు 2026 కొత్త ఏడాది వస్తూనే గుడ్ న్యూస్ ని మోసుకొచ్చిందని అంటున్నారు. ఆయనది పాతికేళ్ళకు పైబడిన రాజకీయ జీవితం. ఓటమి ఎరుగని నైజం. ఒకసారి ఎంపీగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఏడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన గంటా ఉత్తరాంధ్రాలోనే కీలక నేతగా ఉన్నారు. అలాగే ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ప్రముఖ స్థానంలో ఉన్నారు.
అసంతృప్తితోనే :
అలాంటి గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి తొంభై వేల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. దాంతో ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు, పైగా విశాఖ జిల్లాకే కేబినెట్ లో అవకాశం లేకుండా పోయింది. అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. నర్శీపట్నం నుంచి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పోస్టు ఇచ్చారు. ఇక విశాఖ జిల్లా నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చాన్స్ ఇచ్చారు. అయితే గంటా మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దాంతో గంటా అనుచరులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
గతానికి భిన్నంగా :
ఇక గంటా చూస్తే గతానికి భిన్నంగా జోరు చేస్తూ వస్తున్నారు తన సొంత నియోజకవర్గం భీమిలీలో ఆయన వరసగా పర్యటనలు చేస్తున్నారు. ప్రతీ రోజూ ఆయన ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వంలో భీమిలీ నియోజకవర్గం పరిధిలోనే అభివృద్ధి అంతా సాగుతోంది. ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. భీమిలీ మండలంలోని అన్నవరం గ్రామంలో ఈ మధ్యనే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి పునాది రాయి పడింది. భీమిలీ టూ భోగాపురం దాకా టూరిజం డెస్టినీ అవుతోంది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా భీమిలీ మారిపోయింది.
భూ సేకరణ ఇష్యూస్ :
ఇక అభివృద్ధికి అవసరం అయిన భూముల సేకరణ అన్నదే ఇపుడు బిగ్ ఇష్యూగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వమని కొంతమంది రైతులు ఆందోళన చేస్తే దాన్ని స్మూత్ గా డీల్ చేసి ఇష్యూని ముగించారు ఎమ్మెల్యేగా గంటా. దాంతో మార్చిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు రంగం సిద్ధం అయింది. ఇదే తీరున మరిన్ని భూ సేకరణ సమస్యలలో కూడా గంటా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక కొలిక్కి తెస్తున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో ఆయనకూ అన్ని చోట్లా పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. దాంతో ఆయన సమస్య ఏదైనా పరిష్కారం చూపగలుగుతున్నారు.
చైర్మన్ హోదాలో :
దాంతో ఉత్తరాంధ్రాలో అనేక పరిశ్రమలు తొందరలో ఏర్పాటు అవుతున్నాయి. వాటికి కూడా భూ సమీకరణ అవసరం పడుతోంది. ఈ నేపధ్యంలో గంటా చాకచక్యం ఆయన అనుభవాన్ని వినియోగించుకునే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా గంటాని నియమిస్తారు అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి ఎంతో కీలకమైనదిగా చెబుతున్నారు. దీని పరిధి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలను కలుపుకుని తొమ్మిది జిల్లాలకు విస్తరిస్తుంది అని అంటున్నారు. దాంతో ఈ కీలకమైన పదవిలో గంటా రానున్న రోజులలో అధికారిక హోదాను అలాగే అధికారాన్ని పూర్తిగా అందుకుంటారని అంటున్నారు.
