గంటాలో అసహనం...నోరు జారిన వైనం !
ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి అన్నది అంతా చెప్పుకుంటారు.
By: Tupaki Desk | 10 April 2025 10:53 PM ISTఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి అన్నది అంతా చెప్పుకుంటారు. ఆయన హుందాగా రాజకీయం చేస్తారు. ఆయన ఎపుడూ ప్రసన్న వదనంతో ఉంటారు. పరుష పదజాలం ఆయన వాడినది కూడా ఇప్పటిదాకా ఎక్కడా రికార్డు కాలేదు.
ఆయనను సొంత పార్టీలో కానీ బయట రాజకీయ ప్రత్యర్ధులు కానీ విమర్శలు తీవ్ర స్థాయిలో చేసినా ఆయన చిరునవ్వుతోనే జవాబు చెబుతూ లైట్ తీసుకునేవారు. అలాంటి గంటాలో ఎపుడూ చూడని కోణం తాజాగా బయటపడింది. ఈయన మన గంటాయేనా అనుకునేలా ఆయన తీరు ఉంది అంటున్నారు.
ఆరున్నర పదుల వయసులో ఉన్న గంటాలో అసహనం ఇలా కనిపిస్తోందా అన్న చర్చ కూడా చోటు చేసుకుంటోంది. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న గంటా మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కలేదు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే గంటా తన రాజకీయానికి పదును పెడుతున్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమునిపట్నంలో తన రాజకీయ వారసుడిని 2029 నాటికి నిలబెట్టాలని చూస్తున్నారు. ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా పట్టుదలగా ప్రతీ చోటా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలతో చర్చించి వాటి పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడ ఆదేశాలు ఇస్తున్న్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన నియోజకవర్గం పర్యటనలో మాత్రం అసహనంగా ఒక అధికారి మీద నోరు చేసుకున్న వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటా ఎందుకిలా అని అంతా అనుకునేలా ఉంది ఆ వీడియో బైట్. అధికారుల విషయంలో తప్పు జరిగితే ఆగ్రహించవచ్చు కానీ దుర్భాషలు ఆడడం తగని పని అని అంటున్నారు.
కానీ గంటా మాత్రం పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ మీద నడి రోడ్డు మీదనే విరుచుకుపడ్డారు. దానికి కారణం ఏమిటి అంటే కనీసం తాగేందుకు కూడా నీళ్లు సరిగా రావడం లేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని స్థానికులు ప్రశ్నించడంతో అధికారుల మీద గంటా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు ఏమి చేస్తున్నారు అని నిలదీశారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తారా అని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా ఆయన అధికారులను ప్రశ్నించడం వరకూ ఓకే కానీ ప్రభుత్వ అధికారిని బహిరంగంగా అందరి ముందు పట్టుకుని దుర్భాషలు ఆడడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. దాంతో ఇదీ గంటా నీ సంస్కారమా అని ప్రత్యర్ధులు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే పోలీసుల మీద వైసీపీ అధినాయకత్వం చేసిన కామెంట్స్ తో పోలీసుల సంఘం నాయకులు మండుతున్నారు. ఇపుడు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే సీనియర్ నేత ప్రభుత్వ అధికారుల మీద
ఇలా మాట్లాడితే ఎలా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే సూపర్-6 హామీలపై ఎక్కడ జనం ప్రశ్నిస్తారోనని గంటా తన ఈ విధంగా వ్యవహరించారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా పాతికేళ్ళ రాజకీయ జీవితం చూసిన గంటా ఎపుడూ ఈ విధంగా వ్యవహరించలేదని అంటున్నారు.
