Begin typing your search above and press return to search.

గంటా ప్రత్యర్ధికి టీడీపీ కండువా ?

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అయిన గంటా శ్రీనివాసరావు ఎంత పవర్ ఫుల్ లీడర్ అన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 May 2025 9:30 AM
గంటా ప్రత్యర్ధికి టీడీపీ కండువా ?
X

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అయిన గంటా శ్రీనివాసరావు ఎంత పవర్ ఫుల్ లీడర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఏ రోజూ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. ఒకసారి ఎంపీగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన గంటా తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూశారు.

ఆయన గెలిస్తే చాలు మంత్రి పదవి ఖాయం అన్న మాట ఉండేది. అలాంటిది ఈసారి మాత్రం అలా కుదరలేదు. 2024లో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గంటా గెలిచారు. ఆయన అంచనాలు తపకుండా టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ గంటాకు చాన్స్ దక్కలేదు. జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోయారు.

ఇది ఇలా ఉంటే ఆయన మాట హైకమాండ్ వద్ద పెద్దగా చెల్లడంలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్ధి గా మారిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు టీడీపీ కండువా కప్పుతోంది అని అంటున్నారు. తొందరలోనే అది జరగనుంది అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి గెలిచేందుకు అవిశ్వాసం నెగ్గేందుకు ఒకే ఒక్క ఓటు తారకమంత్రంగా పనిచేసింది. ఆ ఓటే అవంతి కుమార్తె ఆరవ వార్డు కార్పోరేటర్ అయిన లక్ష్మీ ప్రియాంక. ఇలా టీడీపీకి సరైన సమయంలో ఆదుకున్న అవంతి మీద పార్టీ పెద్దలు ఎంతో దయ చూపుతున్నారుట.

దాంతో ఒకనాడు తానుగా కోరి వెళ్ళి పసుపు తీర్ధం పుచ్చుకుంటాను అంటే స్పందించని వారు ఇపుడు ఆయనని కావాలని పిలుస్తున్నారుట. దాంతో అవంతి వర్గం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే అవంతి తొందరలోనే పసుపు పార్టీలో చేరి కొత్త తమ్ముడు అయిపోతారు అని అంటున్నారు.

అయితే అవంతి టీడీపీలో చేరడం గంటాకు ఇష్టం లేదని అంటున్నారు. నిజానికి గంటా వల్లనే అవంతి చేరిక కూడా గతంలో ఒకసారి బ్రేక్ పడింది అని కూడా అంటున్నారు. గంటాయే అవంతిని రాజకీయాల్లోకి తెచ్చారు. ఆయన వల్లనే ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అవంతి గెలిచారు. అలా గంటాను రాజకీయ గురువుగా చేసుకుని ఎంపీగా కూడా మరోసారి నెగ్గారు.

కానీ 2019 ఎన్నికల ముందు ఇద్దరి మధ్యన భీమిలీ సీటు ఫైట్ తెచ్చింది. దాంతో గంటాతో విభేదించి ఆయన వైసీపీలో చేరారు అక్కడ మంత్రి అయ్యారు. ఇక గంటా వైసీపీలోకి రావాలని చూసినపుడు అవంతి అక్కడ అడ్డు చక్రం వేశారు అని అంటారు.

ఇలా ఇద్దరూ ఒకరి పొడ మరొకరు గిట్టకుండా అయిదారేళ్ళుగా రాజకీయ సమరమే సాగిస్తున్నారు. అలాంటిది అవంతి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్న వేళ గంటా వర్గం రియాక్షన్ వేరేగా ఉందని అంటున్నారు అయితే గంటాను జస్ట్ ఎమ్మెల్యేగా మాత్రమే చేసిన అధినాయకత్వం ఆయనకు పెద్దగా గిట్టని ఒకనాటి ప్రత్యర్ధి అవంతిని పార్టీలోకి తీసుకుని రావడం ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తున్నారు అన్నదే చర్చగా ఉందట.