Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి గంగుల మౌనం వెనక కథేంటి?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. గతంలో బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై విచారణ చేపట్టే అవకాశం ఉండటంతో వారిలో భయం పట్టుకుంది

By:  Tupaki Desk   |   26 Dec 2023 2:15 AM GMT
మాజీ మంత్రి గంగుల మౌనం వెనక కథేంటి?
X

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. గతంలో బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై విచారణ చేపట్టే అవకాశం ఉండటంతో వారిలో భయం పట్టుకుంది. కరీంనగర్ లో గత 15 ఏళ్లుగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అతి తక్కువ మెజార్టీతో బయట పడినా మదిలో మాత్రం భయం పట్టుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కొనసాగించిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశముందని అంటున్నారు.

గంగుల కమలాకర్ పై ఇప్పటికే ఈడీ కేసు విచారణలో ఉంది. క్వారీల విషయంలో ప్రభుత్వానికి పన్ను ఎగవేశారనే ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుతో విచారణ కొనసాగింది. అప్పుడే వందల కోట్ల గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు గంగుల అక్రమాల ఆరోపణలు పై విచారణ చేపడితే ఇంకా చాలా విషయాలు వెలుగుచూసే ఆస్కారం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

గంగల కమలాకర్ కు గెలిచిన సంబరం లేదు. ప్రజలతో కలవడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. కనీసం గేటు కూడా దాటడం లేదు. ఈనేపథ్యంలో గంగుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీలో తప్ప బయట ఎక్కడ కూడా ముఖం చూపించడం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేసిన గంగుల ఇప్పుడు ఆయన చేతిలోనే కీలుబొమ్మగా మారే ప్రమాదముందని చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కబ్జాకోరులకు తన అండదండలు అందించారనే ఆరోపణలున్నాయి. దీంతో బాధితులంతా మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి గంగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో గంగులపై చర్యలకు ఉపక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. గంగుల అవినీతి, అక్రమాల గురించి విచారణ జరిపితే ఇంకా పలు కోణాలు బయట పడే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో గంగుల మౌనం వహిస్తున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తాను గెలిచినా ప్రభుత్వం రాకపోవడంతో భయం వెంటాడుతోంది.