Begin typing your search above and press return to search.

డేంజరస్ గ్యాంగ్ స్టర్ ను ఇండియాకు పంపించిన అమెరికా..

ఇది సాధారణ డిపోర్టేషన్ కాదు.. రెండు దేశాల ఏజెన్సీలు కలిసి నడిపిన అరుదైన ఆపరేషన్.

By:  Tupaki Desk   |   19 Nov 2025 4:15 PM IST
డేంజరస్ గ్యాంగ్ స్టర్ ను ఇండియాకు పంపించిన అమెరికా..
X

ఒక దేశంలో నేరాలు చేసిన వ్యక్తి.. నకిలీ పత్రాలతో మరో దేశంలో దాక్కుంటే.. దర్యాప్తు ఏజెన్సీలు ఎదుర్కొనే సవాళ్లు వర్ణనాతీతం. ముఖ్యంగా ఆ వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు.. ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ నడిపే గ్యాంగ్‌స్టర్ అయితే.. పట్టుకోవడం అతి కష్టం. ఇదే పరిస్థితి భారత్‌ ఎదుర్కొన్నది. ఏళ్ల తరబడి అమెరికాలో దాక్కున్న అన్మోల్‌ బిష్ణోయ్‌పై భారత్‌ నుంచి వచ్చిన వారెంట్లు, ఎన్‌ఐఏ అలర్టులు, ఇన్‌పుట్లు చివరకు ఫలించి, అగ్రరాజ్యం అతడిని ఇండియాకు డిపోర్ట్ చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇది సాధారణ డిపోర్టేషన్ కాదు.. రెండు దేశాల ఏజెన్సీలు కలిసి నడిపిన అరుదైన ఆపరేషన్.

ఢిల్లీకి చేరుకున్న అన్మోల్..

ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు సహా పలు ప్రధాన కేసుల్లో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్ (Gangster Anmol Bishnoi)ను అమెరికా అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు. అతడితో పాటు 199 మందిని కూడా పంపించారు. వీరిలో ఇద్దరు పంజాబ్‌ వాంటెడ్‌ జాబితాలో ఉండగా.. మిగిలినవారు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నవారే. వారికి చెందిన విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

లారెన్స్ సోదరుడు..

అన్మోల్‌ బిష్ణోయ్, ప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు. గతేడాది ఏప్రిల్‌లో నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన తర్వాత అతడిపై ముంబయి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులతోనూ అతడు టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతడిపై అభియోగాలున్నాయి.

నిఘా వర్గాల ప్రకారం.. మూసేవాలా హత్యకు కొద్ది రోజుల ముందు అన్మోల్‌ నకిలీ పత్రాలతో దేశం దాటినట్లు సమాచారం. అతడిపై వివిధ రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. అతడి కదలికల గురించి సమాచారం ఇచ్చిన వారికి ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం గ్యాంగ్‌స్టర్‌ ప్రమాదకర స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది.

విదేశాల్లో నుంచే తన గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన అన్మోల్‌ను భారత్‌ తీసుకురావడానికి ముంబయి పోలీసులు, ఎన్‌ఐఏ కలిసి విస్తృతంగా ప్రయత్నాలు చేశారు. గత ఏడాది అతడు అమెరికా పోలీసులకు చిక్కిన తర్వాత, భారత సంస్థలు అక్కడి ఎఫ్‌బీఐ, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీతో సమన్వయం సాధించాయి. ఈ పరస్పర చర్చల అనంతరం, అమెరికా అతడిని అధికారికంగా డిపోర్ట్ చేసింది.