ఏపీకి భారీ బూస్ట్: గంగవరం పోర్టులో ఐరన్ ఓర్ హబ్
వైజాగ్ లోని గంగవరం పోర్టులో ముడి ఇనుము బ్లెండింగ్ యూనిట్ స్థాపనకు కీలక ఒప్పందం కుదిరింది.
By: Tupaki Desk | 23 Feb 2026 2:18 PM ISTవైజాగ్ లోని గంగవరం పోర్టులో ముడి ఇనుము బ్లెండింగ్ యూనిట్ స్థాపనకు కీలక ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఎన్ఎండీసీ, అదానీ పోర్ట్స్, బ్రెజిల్‌కు చెందిన వేల్ గ్రూప్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో ఏపీకి ఆర్థిక తోడ్పాడు అందనుందని అంటున్నారు. భారీగా ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా ఐరెన్ ఓర్ ఎగుమతుల కేంద్రంగా ఏపీ అభివృద్ధి చెందనుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉక్కు రంగంలోని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన ఇండియా-బ్రెజిల్ బిజినెస్ ఫోరమ్ సమ్మిట్‌లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా సమక్షంలో మూడు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, గంగవరం పోర్టులో ఇనుప ఖనిజం బ్లెండింగ్ సౌకర్యంతోపాటు ప్రత్యేక ఆర్థిక మండలిని అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఉక్కు తయారీదారుల అవసరాలకు అనుగుణంగా గంగవరం పోర్టులోనే ఐరెన్ బ్లెండింగ్ చేయనున్నారు. ఇది ఉక్కు నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, ఉక్కు కర్మాగారాలకు సరఫరా సాఫీగా జరిగేలా చూస్తుందని చెబుతున్నారు. గంగవరం పోర్టులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఉక్కు, మైనింగ్ రంగాలకు ఏపీ ఒక కీలకమైన లాజిస్టిక్స్ హబ్ గా మారుతుందని అంటున్నారు. దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారైన ఎన్ఎండీసీ ముడి సరుకును సరఫరా చేయనుంది. బ్రెజిల్‌కు చెందిన వేల్ గ్రూప్ మార్కెటింగ్ చేయనుందని చెబుతున్నారు. ఇందులో మరో భాగస్వామి అయిన అదానీ పోర్ట్స్ భారీ స్థాయిలో సరుకు రవాణా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని చెబుతున్నారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్-బ్రెజిల్ వాణిజ్య కారిడార్‌కు ఏపీ కేంద్ర బిందువుగా మారుతుందని చెబుతున్నారు. మరోవైపు పోర్టులో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. కొత్త కంపెనీల స్థాపన, తద్వారా స్థానిక ఉపాధికి గంగవరం బ్లెండింగ్ సెజ్ ఉపకరిస్తుందని చెబుతున్నారు.
బ్లెండింగ్ అంటే..
ప్రకృతిలో దొరికే ఇనుప ఖనిజం అంతా ఒకే రకమైన నాణ్యతతో ఉండదు. కొన్ని చోట్ల ఇనుము శాతం ఎక్కువగా ఉంటే, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. తక్కువ రకం ఖనిజాన్ని, నాణ్యమైన ఖనిజంతో కలిపి ఒక నిర్ణీత ప్రమాణం వచ్చేలా చేయడాన్నే బ్లెండింగ్ అంటారు. ఖరీదైన హై-గ్రేడ్ ఖనిజాన్ని వాడకుండా, తక్కువ రకం ఖనిజాన్ని కలపడం ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. ప్రతి స్టీల్ ప్లాంట్ ఒక నిర్దిష్టమైన మిశ్రమాన్ని కోరుకుంటుంది. బ్లెండింగ్ ద్వారా వారికి కావాల్సిన 'కెమికల్ కాంపోజిషన్' తయారు చేయవచ్చు. వైజాగ్ గంగవరం పోర్టులో ఏర్పాటు చేయబోయే ఈ 'బ్లెండింగ్ ఫెసిలిటీ' వల్ల, విదేశాల నుంచి వచ్చే నాణ్యమైన ఖనిజాన్ని, మన దేశంలోని ఖనిజంతో కలిపి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ముడిసరుకును తయారు చేస్తారని చెబుతున్నారు.
