గణేశ్ నిమజ్జన వేళ ఏపీలో ఏడుగురు భక్తులు మృతి
అత్యంత వైభవంగా నిర్వహించిన వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు చోట్ల భారీగా గణేశ్ మండపాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.
By: Garuda Media | 1 Sept 2025 3:18 PM ISTఅత్యంత వైభవంగా నిర్వహించిన వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు చోట్ల భారీగా గణేశ్ మండపాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. వినాయక చవితి తర్వాత మూడో రోజు మొదలు.. పదకొండో రోజు వరకు పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో వీకెండ్ వేళ(ఆదివారం) నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో ఏడు నిండు ప్రాణాలు బలి కావటం విషాదంగా మారింది.
ఏపీలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో మూడు చోట్ల చోటు చేసుకున్న ఈ ప్రమాదాలు పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. అదే సమయంలో ఆరుగురు తీవ్ర గాయాల బారిన పడి.. చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో నిర్వహించిన వినాయక చవితి ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో 58 ఏళ్ల సూర్యనారాయణ.. 38 ఏళ్ల మురళి.. 35 ఏళ్ల తిరుమల నరసింహమూర్తి..కడియం దినేశ్ గా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
మరో విషాద ఉదంతానికి వస్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.. ఊమ్మడి విశాఖ జిల్లాల్లోని కొంత భాగాన్ని తీసుకొని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేయటం తెలిసిందే. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతల వీధిలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం తీరని విషాదాన్ని మిగిల్చింది. గణేశ్ నిమజ్జనం కోసం వెళుతున్న వేళ.. వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం.. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘోర ప్రమాదంలో కొండబాబు.. సీతారామ్ అనే ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.అయితే.. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా కావలిలోనూ మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెం సముద్రతీరంలో గణేశ్ నిమజ్జనం కోసం కావలికి చెందిన పదహారేళ్ల లక్ష్మి ప్రమాదవశాత్తు మరణించింది. ఇలా..మూడు చోట్ల చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతాలు పూడ్చలేని గుండెకోతకు గురి చేశాయని చెప్పక తప్పదు.
