Begin typing your search above and press return to search.

గాంధీభవన్ శివాలయం.. కార్తీక మాసం కళ.. కర్ణాటక 'శివుడి' ఆధ్వర్యం

మొన్నటివరకు నాయక సంచారం తక్కువగా ఉండి.. పిల్లులు ఇతర జంతువులు యథేచ్ఛగా తిరుగాడిన గాంధీభవన్ కు మళ్లీ కళ వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 8:50 AM GMT
గాంధీభవన్ శివాలయం.. కార్తీక మాసం కళ.. కర్ణాటక శివుడి ఆధ్వర్యం
X

అది 2003-04.. ఉమ్మడి ఏపీ.. అప్పట్లో మహమహులైన నాయకులు ఉండేవారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం.. నాగం జనార్దనరెడ్డి, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆ వైపు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. డి.శ్రీనివాస్, కొణిజేటి రోశయ్య, జానారెడ్డి ఈ వైపు. అసెంబ్లీ అత్యంత వాడివేడిగా సాగిన బయట నాయకుల మధ్య చక్కటి వాతావరణం ఉండేది. పరస్పర విమర్శలు సభలోనే.. కానీ, ఆ ప్రాంగణం దాటి రాగానే వ్యంగ్యోక్తులు, విసుర్లు. ఇలాంటి సన్నివేశమే ఓసారి చోటుచేసుకుంది.

2004 ఎన్నికలకు ముందు అనుకుంటా. కొణిజేటి రోశయ్య మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి గెలవకుంటే ఖతమే అనుకుంటున్న సమయం అది. రోశయ్య మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ భవన్ ను ఆయన వైష్ణవాలయంతో పోల్చారు. సహజంగానే ప్రాంతీయ పార్టీ కాబట్టి టీడీపీ మీడియాకు ఇచ్చే ప్రాధాన్యం వేరేగా ఉంటుంది. దీనికితగ్గట్లే వారి కార్యాలయం వద్ద హడావుడి, అలంకరణ ఉంటాయి. అచ్చం.. దేవుళ్లలో ధనికుడైన విష్ణుమూర్తి ఆలయాల్లా అన్నమాట. దీన్నిబట్టే రోశయ్య.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను వైష్ణవాలయంతో పోల్చారు. కాంగ్రెస్ కార్యాలయం అయిన గాంధీభవన్ ను శివాలయంగా పేర్కొన్నారు. సహజంగానే శివాలయాలు నిరలంకారంగా ఉంటాయి. ఏదో కార్తీక మాసం సందర్భంగా కళకళలాడడం తప్ప మిగతా ఎక్కువ కాలం సందడి తక్కువే. ప్రత్యేక పూజల సమయంలోనే భక్తులు శివాలయానికి వెళ్తారు. అందులోనూ శివుడు కూడా అలంకార ప్రియుడు కాదు. గాంధీభవన్ కూడా అలానే అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ఆ పార్టీకి కళ. లేదంటే గాంధీభవన్ మెట్టెక్కేవారే పెద్దగా ఉండరు. అక్కడి సిబ్బందే అంతా చూసుకుంటూ ఉంటారు. అంతెందుకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో.. ఆరు నెలల కిందటి వరకు గాంధీభవన్ కు వచ్చిన వారెందరంటే తక్కువమందేనని చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కువ శాతం ప్రెస్ మీట్లను బయటనే నిర్వహించేవారు.

మళ్లీ కళకళ..

మొన్నటివరకు నాయక సంచారం తక్కువగా ఉండి.. పిల్లులు ఇతర జంతువులు యథేచ్ఛగా తిరుగాడిన గాంధీభవన్ కు మళ్లీ కళ వచ్చింది. దాదాపు పదేళ్లుగా గాంధీ భవన్ కళా విహీనంగా ఉంది. తాజా తెలంగాణ ఎన్నికల ఫలితంతో మాత్రం అంతా మారిపోయింది. పెద్దపెద్ద నాయకుల పర్యటన సందర్భంగా వెలిసే జామర్లు ఏర్పాటయ్యాయి. పూలదండలతో అలంకరణ.. బాణసంచా కాల్పులు.. నాయకుల హంగామా.. జైజై కాంగ్రెస్ నినాదాలు అహో పూర్వ వైభవం అంటే ఇదేనేమో అనేంత సందడి నెలకొంది. అందులోనూ పార్టీ గెలుపు ఖాయమయ్యాక రేవంత్ నేరుగా గాంధీభవన్ కే రావడంతో మరింత సందడి సందడిగా మారింది.

నాటి రోశయ్య పోలిక.. నేటికి

20 ఏళ్ల కిందట గాంధీభవన్ ను రోశయ్య ఏమంటూ శివాలయంతో పోల్చారో గానీ.. సరిగ్గా కార్తీక మాసంలో కార్యాలయానికి దివ్యమైన కళ వచ్చింది. శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది అనే సంగతి తెలిసిందే. శివ భక్తులు ఎంతో నిష్ఠతో ఈ నెలలో పూజలు చేస్తారు. ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు మార్గదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల మొదటినుంచి.. సీఎం ఎంపిక వరకు అధిష్ఠానం దూతగా వ్యవహరించారు. అంటే.. కార్తీక మాసంలో కర్ణాటక శివుడి దర్శకత్వంలో గాంధీభవన్ కు కళ వచ్చిందన్నమాట.