నేపాల్ లో మావోయిస్టు గణపతి.. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్!
మావోయిస్టు పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది.
By: Tupaki Political Desk | 25 Feb 2026 10:04 PM ISTమావోయిస్టు పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు ఉద్యమం అవసాన దశకు చేరుకున్న సమయంలో గణపతి ఎక్కడున్నారనే విషయంపై ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. మావోయిస్టు పార్టీ తాత్కాలిక సారధి, మిలటరీ కమిషన్ ఇంచార్జి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగుబాటు తర్వాత అందరి దృష్టి అగ్రనేత గణపతిపైకి వెళ్లింది. 2018లో మావోయిస్టు పార్టీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న గణపతి 2024 తర్వాత దండకారణ్యాన్ని వీడారని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో గణపతి, భార్య జోడే రత్నబాయి అలియాస్ సుజాతతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడని అనుమానిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక నేతల దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహులు, బడే చొక్కారావు తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. దీంతో కేంద్ర కమిటీలో ఇక అగ్రనేత గణపతి మాత్రమే మిగిలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయనను లొంగిపోయేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు గణపతి ఎక్కడ ఉన్నది పోలీసులు గుర్తించలేదని అంటున్నారు. ఇదే సమయంలో కొందరు ఇచ్చిన సమాచారంతో గణపతి నేపాల్ లో తలదాచుకున్నారని తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు.
గణపతి, ఆయన భార్య రత్నబాయిని నేపాల్ లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని రెండు రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెడతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గణపతి ఎక్కడున్నారన్న విషయం లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు కూడా తెలియదన్న ప్రచారమూ జరుగుతోంది. దీంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడం లేదని అంటున్నారు. వయోభారంతో 2018లో పార్టీ సారథ్యాన్ని నంబాల కేశవరావుకు అప్పగించిన గణపతి అబూజ్ మడ్ అడవుల్లో విశ్రాంతి తీసుకునే వారని కొందరు మావోయిస్టులు పోలీసులకు తెలిపినట్లు చెబుతున్నారు.
అయితే ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన అడవులను వీడారని అంటున్నారు. చివరగా, 2024 జులై - ఆగస్టు మధ్యలో మావోయిస్టు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశంలో గణపతి పాల్గొన్నారని, ఆ తర్వాత ఆయన ఆచూకీ ఎవరికీ తెలియదని చెబుతున్నారు. అబూజ్ మడ్ అడవుల నుంచి ఝర్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లిన గణపతి అటు నుంచి నేపాల్ లో సురక్షిత స్థావరానికి చేరుకున్నారని అంటున్నారు. అయితే ఆయన నేపాల్ నుంచి ఫిలప్పీన్స్ వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారానికి భిన్నంగా దేశంలో అర్బన్ షెల్టర్ లో కూడా ఆయన తలదాచుకుని ఉంటారని మరికొందరు చెబుతున్నారు.
ఇలా గణపతి ఆచూకీపై రకరకాల ప్రచారం జరుగుతుండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 43 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన తమ సోదరుడు లక్ష్మణరావు అలియాస్ గణపతికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, ఆయనను సురక్షితంగా లొంగిపోయే వాతావరణం కల్పించాలని గణపతి సోదరుడు రామచంద్రరావు మీడియా ముఖంగా కోరారు. గణపతి రాక కోసం తమ కుటుంబంతోపాటు ఊరు అంతా ఎదురుచూస్తోందని ఆయన తాజాగా ప్రకటన చేశారు. విప్లవాన్ని వీడి శేష జీవితాన్ని హాయిగా గడపాలని విజ్ఞప్తి చేశారు.
