Begin typing your search above and press return to search.

గన్నవరం నుంచి వంశీని తప్పిస్తున్నారా ?

ఇలా వంశీ కోసం వైసీపీ చాలానే చేసింది. అయితే ఇపుడు మాత్రం వంశీ సొంత సీటు అయిన గన్నవరంలో వైసీపీ ఇంచార్జిగా ఆయనను మారుస్తారా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   14 May 2025 5:00 AM IST
గన్నవరం నుంచి వంశీని తప్పిస్తున్నారా ?
X

చాలా రోజులుగా జైలులో ఉంటూ బెయిల్ మీద బయటకు వస్తున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. వంశీ కోసం జైలుకు వచ్చి మరీ పరామర్శించిన వారు వైసీపీ అధినేత జగన్. వంశీ అందగాడు అని అందుకే టీడీపీ పెద్దలకు ఆయన అంటే అసూయ అని సంచలన వ్యాఖ్యలు ఆనాడు ఆయన చేశారు.

వంశీకి వైసీపీలో మంచి స్థానం ఉంది. 2024లో ఆయనకు టికెట్ ఇవ్వవద్దని ఎందరు చెప్పినా ఇచ్చిన ఘనత వైసీపీ అధినాయకత్వానిదే. అంతే కాదు, వంశీ కోసం పార్టీలో మొదటి నుంచు ఉన్న యార్లగడ్డ వెంకటరావుని సైతం పార్టీ వదులుకుంది. ఇక వైఎస్సార్ ని అభిమానిస్తూ వైసీపీలో కీలక నేతగా ఉన్న మరో నేత దుట్టా రామచంద్రరావుకు సైతం టికెట్ మళ్ళీ ఇవ్వలేదు.

ఇలా వంశీ కోసం వైసీపీ చాలానే చేసింది. అయితే ఇపుడు మాత్రం వంశీ సొంత సీటు అయిన గన్నవరంలో వైసీపీ ఇంచార్జిగా ఆయనను మారుస్తారా అన్న చర్చ సాగుతోంది. వంశీని కాదని అక్కడ ఎవరిని పెడతారు అంటే సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతామహాలక్ష్మి అని గట్టిగా వినిపిస్తోంది.

దుట్టా సీతారామలక్ష్మి వైసీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. తండ్రి ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఎంతో ఉత్సాహంగా ఆమె పాల్గొన్నారు. ఇక జగన్ కి దుట్టా రామచంద్రరావు ఎంతో సన్నిహితుడు. వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు. ఇక దుట్టా సీతామహాలక్ష్మి భర్త శివభరత్ రెడ్డి వైసీపీ అధినాయకత్వానికి ఎంతో క్లోజ్ గా ఉంటారు. పైగా కడప వాసి.

ఈ నేపధ్యంలో తన భార్యకు గన్నవరం ఇంచార్జి బాధ్యతలను ఆయన కోరారా లేక దుట్టా రామచంద్రరావు కుమార్తెగా ఆమెని ముందుకు తెచ్చారా లేక వల్లభనేని వంశీ కేసులు జైలు ఇలా నియోజకవర్గం విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేని నేపధ్యంలో సరైన ఆల్టర్నేషన్ కోసం వెతుకుతున్నారా అన్నది తెలియదు. బహుశా ఇవన్నీ కారణాలు కావచ్చు అని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ గన్నవరం వైసీపీ సరైన నాధుడు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో వైసీపీ అధినాయకత్వం అక్కడ సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే దుట్టా సీతకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఇక వంశీకి 2024లో టికెట్ ఇచ్చినా దుట్టా ఆయనకే మద్దతు ఇచ్చారు. ఇదంతా పార్టీ కోసమే విధేయతతో చేశారు. దాంతో పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న దుట్టాకు న్యాయం చేయాలని డిమాండ్ వస్తోంది. దాంతో వైసీపీ అక్కడ కొత్త ఇంచార్జిగా నియమించాలని చూస్తున్నారు.

ఇక దుట్టా సీతారామలక్ష్మి విద్యాధికురాలుగా ఉన్నారు. ఒక డాక్టర్ గా ఉన్నారు. ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు ఆమెకి కనుక ఇన్చార్జి పదవి ఇస్తే కచ్చితంగా వంశీ వర్గీయులు కూడా మద్దతు ఇస్తారని అంటున్నారు. దీనికి తోడు 2024లో తాను ఓటమి చెందితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా చెప్పేశారు.

దీంతో దుట్టా ఫ్యామిలీకి న్యాయం చేయాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో గన్నవరం వైసీపీకి తొందరలోనే దుట్టా సీతను ఇంచార్జిగా చేయడమే కాదు వచ్చే ఎన్నికల్లో ఆమెనే అభ్యర్ధిగా ప్రకటిస్తారు అని అంటున్నారు. దీని వల్ల మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయి గన్నవరంలో 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయని భావిస్తున్నారు మొత్తం మీద చూస్తే కనుక వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.