Begin typing your search above and press return to search.

గ‌ల్లా గ‌ళం.. బాబుకు వినిపించేలా ..!

గుంటూరు వెస్ట్ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బీసీ నాయకురాలు గల్లా మాధవి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా జగన్ పై చేసిన వ్యాఖ్యలు కీల‌కంగా మారాయి

By:  Tupaki Desk   |   20 Jun 2025 11:53 PM IST
గ‌ల్లా గ‌ళం.. బాబుకు వినిపించేలా ..!
X

టిడిపిలో కొత్తగా వచ్చిన నాయకులు కూడా బలమైన గలం వినిపిస్తున్నారు. సంస్థాగతంగా ఉన్న నాయకుల మాట ఎలా ఉన్నా ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన వారు, కొత్తగా జెండా కప్పుకున్న వారు కూడా బలమైన వాయిస్ వినిపిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి కీలకంగా మారారు. గుంటూరు వెస్ట్ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బీసీ నాయకురాలు గల్లా మాధవి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా జగన్ పై చేసిన వ్యాఖ్యలు కీల‌కంగా మారాయి.

గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఆయన నిర్వహించిన పరామర్శ యాత్ర పై చేసిన విమర్శలు హైలైట్ గా నిలిచాయి. రెంటపాళ్ల జగన్ పర్యటనపై టిడిపి నాయకులు ఏం హోంవర్క్ చేశారంటూ సీఎం చంద్రబాబు ఆరా తీసినప్పుడు గల్లా మాధవి పేరు మొట్టమొదట వినిపించిందని తెలుస్తోంది. బలమైన ఎదురుదాడి, సమస్యలపై అవగాహన, విమర్శనాత్మక దృక్కోణంలో చేసే వ్యాఖ్యలు పట్టు తప్పని పద విన్యాసం వంటివి గల్లా మాధవికి పెట్టని కోటగా మారాయి.

వాస్తవానికి గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు ఆమె రాజకీయాల్లోకి రాలేదు. గత ఏడాది మాత్రమే తొలిసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగారు. అయితే పువ్వు పుట్టగానే పరమళిస్తుందన్నట్టుగా రాజకీయాల్లోకి రావడంతోనే ఆమె ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నిత్యం ప్రజల్లో ఉంటానని చెప్పిన మాట ప్రకారం ఆమె వారానికి నాలుగు సార్లు ఒంటరిగానే ప్రజల వద్దకు వెళ్తున్నారు. చిన్న బైక్ పైనే తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు.

ముఖ్యంగా మురికివాడల అభివృద్ధి దిశగా గల్లా మాధవి అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలోను తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ఇక ప్రతిపక్ష వైసిపిని టార్గెట్ చేయడంలో చాలామంది నాయకులు వెనకబడ్డారని చంద్రబాబు భావిస్తున్న సమయంలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా గల్లా మాధవి ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనపై నిప్పులు చెరగడం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించడం ద్వారా చంద్రబాబు దృష్టిలో పడ్డారు. అంతేకాదు రెంటపాళ్ల పర్యటనపై ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు వైసిపి కూడా సమాధానం చెప్పుకోలేనివిగా ఉన్నాయి.

యువతను చంపుతాం నరుకుతామంటూ రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేయాలని అనుకుంటున్నా రా అని మాధవి సంధించిన ప్రశ్నకు ఇప్పటివరకు వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాకపోవడం గమనార్హం. అంతేకాదు ``ఎక్కడ శవం కనిపిస్తే అక్కడకు జగన్ వచ్చేస్తారు`` అన్న నినాదం బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కువగా నడుస్తుంది.

`శవం ఉంటే జగన్ ఉంటాడు` అనే మాట సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపించడానికి కారణం గల్లా చేసిన వ్యాఖ్యలే. అంత జోరుగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రజల మధ్యకు వెళ్లడం విశేషం. మొత్తంగా గల్లా మాధవి కొత్త నాయకురాలు అయినా పాత నాయకుల కంటే ఎక్కువగానే దూసుకుపోతుండడం చంద్రబాబును మెప్పించేలా వ్యవహరించడం రాజకీయంగా ఆమె భవిష్యత్తును మరింత సుస్థిరం చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.