Begin typing your search above and press return to search.

తెర‌చాటు రాజకీయం: గ‌ల్లాకు వైసీపీ వ‌ల‌.. !

గుంటూరు మాజీ ఎంపీ టీడీపీ మాజీ నాయకుడు గల్లా జయదేవ్ గురించి అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో ఆయన బలమైన గ‌ళం వినిపించారు.

By:  Garuda Media   |   29 July 2025 11:00 PM IST
తెర‌చాటు రాజకీయం: గ‌ల్లాకు వైసీపీ వ‌ల‌.. !
X

గుంటూరు మాజీ ఎంపీ టీడీపీ మాజీ నాయకుడు గల్లా జయదేవ్ గురించి అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో ఆయన బలమైన గ‌ళం వినిపించారు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నేరుగా పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పట్లో ఆయన వ్యాపారాలకు మాత్రమే పరిమితం కావాలని భావించి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న గ‌ల్లా రాజకీయాలను వదిలేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

పైగా వైసిపి హయంలో గల్లా కుటుంబానికి చెందిన కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారన్న వాదన వెలుగులోకి వచ్చినప్పుడు టిడిపి ఆయనకు బలమైన మద్దతుగా నిలిచింది. అయితే, తర్వాత కాలంలో జయదేవ్ తెలంగాణలోని ఓ పార్టీ నాయకులు చెప్పినట్టుగా విని టిడిపికి సరైన సమయంలో సహకరించలేదన్న చర్చ నడిచింది. ఇదే ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చేలా చేసిందని అంటారు. అంటే గత ఎన్నికల్లో పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదని తాజాగా ఓ విశ్లేషకుడు చెప్పుకొచ్చారు.

గత పరిణామాలు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం గల్లా మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ గల్లా జయదేవ్‌కు ఎటువంటి వ్యాపార ఇబ్బందులు లేకపోయినా కేంద్రం స్థాయిలో జరగాల్సిన పనులు ఆయనకు జరగడం లేదు. దీంతో ఏదో ఒక పార్టీలో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మళ్లీ టిడిపిలోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

అయితే.. ఈ విష‌యంలో పార్టీ వెనుకంజ వేస్తోంది. గుంటూరు నుంచి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. కేంద్రంలో మంత్రి కూడా కావడం తెలిసిందే. దీంతో గల్లా జయదేవ్‌కు ప్రత్యేకంగా నియోజకవర్గాన్ని కేటాయించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలకు తోడు కీలక సమయంలో ఆయన పార్టీకి అండగా లేరన్న వాదన కూడా ఉంది. దీంతో టీడీపీ అధిష్టానం గల్లా జయదేవుని లైట్ తీసుకుంది. ఈ నేప‌థ్యంలో దీనిని త‌మ‌కు అవ‌కాశంగా భావిస్తున్న‌ వైసిపి.. గల్లా జయదేవుని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

దీనిపై అంతర్గతంగా చర్చించడంతోపాటు గల్లా జయదేవుకు రాయబారం కూడా పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. బలమైన సామాజిక వర్గం, ఆర్థికంగా బలంగా ఉండడం వంటి కారణాలతో గల్లా జయదేవ్ వంటి వారిని తమ వైపు తిప్పుకోగలిగితే టిడిపికి షాక్ ఇవ్వచ్చు అన్నది వైసిపి ఆలోచన. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరికి ఉండరు. కాబట్టి గల్లా జయదేవ్‌ తమ వైపు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. మరి ఆయ‌న‌ ఎలా ఆలోచిస్తారు ఏం చేస్తారు అనేది చూడాలి.

ఇక్కడ కలిసి వస్తున్న అంశం ఏంటంటే గల్లా జయదేవ్ మాతృమూర్తి గల్లా అరుణ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేయటం. ఆయన ద్వారా గల్లా కుటుంబానికి బలమైన మద్దతు లభించడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో గల్లా జయదేవ్ వైసిపి బాట పట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయ‌న క‌నుక వైసీపీలోకి వ‌స్తే.. గుంటూరును గోల్డెన్‌ప్లేట్‌లో పెట్టి ఆయ‌న‌కే అప్ప‌గించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.