Begin typing your search above and press return to search.

గల్లా ఫ్యామిలీకి కాలం కలిసి రావడం లేదా ?

ఇక ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగి తొలి ప్రయత్నంలోనే గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు.

By:  Tupaki Desk   |   12 May 2025 4:50 AM
గల్లా ఫ్యామిలీకి కాలం కలిసి రావడం లేదా ?
X

కాంగ్రెస్ రక్తమే తమ ఒంట్లో ఉందని చెబుతూ దశాబ్దాల పాటు ఆ పార్టీలోనే ఉంటూ అనేక పదవులు అందుకున్న గల్లా కుటుంబం విభజన అనంతర కాలంలో తెలుగుదేశంలో చేరింది. చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీకి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. అలాంటి కుటుంబంలో గల్లా అరుణ కుమారి పలు మార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.

ఇక ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగి తొలి ప్రయత్నంలోనే గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 2019లో జగన్ వేవ్ ని సైతం తట్టుకుని అయన జెండా పాతారు. అలా రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా 2024 ఎన్నికల ముందు తనంటత తానే తప్పుకున్నారు. ఎందుకో ఆయనలో రాజకీయ వైరాగ్యం ప్రవేశించింది.

నాకొద్దీ రాజకీయం అనేసుకున్నారు. అయితే టీడీపీ ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా తన ఎంపీలతో కారణం అయింది. ఇంతటి అనుకూల సమయంలో ఎంపీగా గల్లా లేరు అంటే ఆయన చేజేతులా చేసుకున్నదే అని అంటున్నారు. ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. గుంటూరు నుంచి ఆయన గెలిస్తే కచ్చితంగా హ్యాట్రిక్ ఎంపీ అయ్యేవారు. అంతే కాదు మోడీ ప్రభుత్వం కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు.

ఆయన కాదనుకుని వెళ్ళిపోవడంతో ఆ చాన్స్ ఎన్నారైగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కి దక్కింది. ఆయన ఎంచక్కా గుంటూరు నుంచి పోటీ చేసి ఫస్ట్ టైం ఎంపీగా ఉండగానే మినిస్టర్ కూడా అయిపోయారు. ఇదంతా గల్లా అభిమానులలో ఇపుడు చర్చగా ఉంది.

మరి గల్లా సంగతి ఏమిటి అంటే అదే అంతు పట్టడం లేదు అని అంటున్నారు. రాజ్యసభ సీటు అయినా ఆయనకు ఇస్తారు అనుకుంటే ఏ ఖాళీ వచ్చినా బీజేపీ వచ్చి దానిని తీసుకుంటోంది. దాంతో పాటు టీడీపీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారు అనేకమంది ఉన్నారు.

ఇలా గల్లాకు అన్ని రకాలుగా ప్రతికూలత కనిపిస్తోంది. అని అంటున్నారు. సరే ఇపుడు కాదు కానీ 2029లో అయినా తమకు చాన్స్ వస్తుందా అంటే ఆ ఆశలు కూడా లేవు అని అంటున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు లో పాతుకుపోయారు. పైగా ఆయన పక్కా లోకల్ అని అంటున్నారు. ఆర్ధికంగా బాగా బలవంతుడు. అంగబలం కూడా ఉంది. దాంతో మళ్లీ ఆయనకే టికెట్ అని అంటున్నారు.

ఇక ఎక్కడ చూసినా ఎంపీ టికెట్లు అయితే ఖాళీ లేవు. మూడు పార్టీలు 2029లో పోటీకి దిగుతాయి కాబట్టి అప్పటికి మరింగతా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందే కానీ సీటు మాత్రం దొరకదని అంటున్నారు. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు అని భావించినా సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పులవర్తి నాని పాగా వేశారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే మరోసారి టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే రాజకీయంగా ఘనత వహించిన గల్లా కుటుంబానికి రాజకీయంగా మంచి రోజులు ఎపుడు అన్న చర్చ వస్తోందిట. ఏది ఏమైనా ఒక ముతక సామెత ఉంది. కాలి దాకా వచ్చినది కాలదన్నుకోరాదు అని. ఆ పని చేసినందుకే గల్లా ఫ్యామిలీ రాజకీయాల్లో రాణీంచలేక అవస్థలు పడుతోంది అని అంటున్నారు.