గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్ల జైలు.. 'పాలిటిక్స్' ఎండేనా?
ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గాలి శాసన సభ్యత్వం రద్దు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 7 May 2025 2:00 PM ISTగాలి జనార్దన్‌రెడ్డి. ఒకప్పుడు దక్షిణాదిలో ఆయనను మించిన కుబేరుడు లేరు. కుమార్తె పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి అందరినీ మెస్మరైజ్ చేసిన ఆయనకు తిరుమల శ్రీవారంటే అమిత భక్తి. అందుకే.. అప్పట్లోనే ఆయన నిలువెత్తు కిరీటం చేయించి శ్రీవారికి కానుకగా ఇచ్చారు. అయితే.. ఆయనపై అక్రమాలు, అవినీతి కేసులు నమోదైన తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానం సదరు కానుకను వెనక్కి ఇచ్చింది. అయితే.. ఆయన అది తిరిగి తీసుకోలేదు. ప్రస్తుతం ఈ కిరీటం.. ఎస్ బీఐ బ్యాంకులో ఉంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడిన నేపథ్యంలో గాలి జనార్దన్‌రెడ్డి ఫ్యూచర్ ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం వ్యక్తి మాత్రమే కాదు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. ఆయన `కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష` పార్టీకి అధినేత కూడా. ఆయన పార్టీ 2023లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 45 స్థానాల్లో పోటీ చేసింది. ఆయన సతీమణి లక్ష్మి కూడా నాయకురాలే. ప్రస్తుతం ఈ పార్టీ విస్తరణ దశలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రగతి పథంలో నడిపించేందుకు, కుదిరితే.. మరోసారి బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా గాలికి ఏడేళ్ల జైలు పడడంతో ఆయన జైలుకు వెళ్లక తప్పదు.
ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గాలి శాసన సభ్యత్వం రద్దు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ఆయనపై పెను ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం ఒక్క మైనింగ్ కేసు మాత్రమే కాకుండా.. కర్నాటక లోకాయుక్త గతంలోనే నమోదు చేసిన కేసుల్లో పలు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్నాళ్లు పార్టీని కూడా నడిపించలేక.. విరాళాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాజకీయాలకు ఇక, గాలి స్వస్తి చెప్పినట్టే అవుతుందని అంటున్నారు.
కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీలో గాలి జనార్దన్‌రెడ్డి వ్యవస్థాపకుడిగా ఉండగా.. ఆయన మిత్రుడు బి. శ్రీరాములు బీజేపీలో ఉన్నారు. ఆయన ఈ పార్టీని తునాతునకలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో శ్రీరాములు.. గాలికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించారు. దీంతో బలమైన గాలి మాట వినే నియోజకవర్గాల్లోనూ పార్టీ పుంజుకోలేక పోయింది. ఇక, ఇప్పుడు ఆయన జైలుకు వెళ్తే.. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ పార్టీలో 45 మంది పోటీ చేస్తే.. ఒకే ఒక్క గాలి జనార్దన్‌రెడ్డి మాత్రం గంగావతి నియోజకవర్గం నుంచి 7 వేల మెజారిటీతో అతి కష్టంమీద విజయం దక్కించుకున్నారు. మరి భవిష్యత్తు ఏం కానుందో చూడాలి.
