Begin typing your search above and press return to search.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు...నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ప్రత్యర్థులుగా భావించే రోజులల్లో రాజకీయ వ్యవస్థ కానీ సమాజం కానీ ఉంది.

By:  Tupaki Desk   |   14 July 2025 10:47 PM IST
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు...నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
X

సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ప్రత్యర్థులుగా భావించే రోజులల్లో రాజకీయ వ్యవస్థ కానీ సమాజం కానీ ఉంది. అలాంటి చోట కేంద్ర మంత్రి ఒకరు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు వేయండి అనడమేంటి అన్నదే చర్చగా ఉంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం కలిగి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి 11 ఏళ్ళుగా కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ.

ఆయన తాజాగా నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కదిలించేలా పిటిషన్లు వేసిన వారే బాధ్యత కలిగిన పౌరులు అని అభివర్ణించారు. ప్రభుత్వం కొన్ని పనులు చేయాలని అనుకున్నా అనేక రకాలైన ఒత్తిళ్ల కారణంగా చేయడం జరగదని లోపాయి కారీ విషయాలను కూడా ఆయన ఆ సభలో పంచుకున్నారు.

అపుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ప్రభుత్వాలను కచ్చితంగా కదిలిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టులలో పిటిషన్లు పడితే ఆయా గౌరవ న్యాయ స్థానానలు కీలక అంశాల మీద ప్రభుత్వాలను ఆదేశిస్తే కచ్చితంగా పనులు జరిగిపోతాయని ఆయన అన్నారు అపుడు అభివృద్ధి అనుకున్న విధంగా సుసాధ్యం అవుతుందని అన్నారు.

అందువల్ల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అంతా ఆహ్వానించాలని ఆయన కోరడం విశేషం. అంతే కాదు అలా వేసే వారు కూడా సమాజానికి అవసరమని వారు చురుకుగా ఎపుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో ఆయన రాజకీయ నాయకులకు కూడా చురకలు అంటించారు. పిటిషన్లు వేసే వారు ఉంటేనే రాజకీయ నేతలు కొంతమని క్రమశిక్షణతో వ్యవహరిస్తారని కూడా అన్నారు.

అంతే కాదు న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులు మంత్రులు తీసుకునే నిర్ణయాల కంటే బలవంతమైనవి అని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు సకాలంలో సమాజానికి ఉపయోగపడే సరైన నిర్ణయాలు తీసుకోలేనపుడు కచ్చితంగా ఈ పిటిషన్లు ద్వారా కోర్టుల నుంచి వచ్చే ఆదేశాలే మంచి దారిలో నడిపిస్తాయని అన్నారు.

ఒకసారి కోర్టులు ఆదేశిస్తే కనుక వాటిని ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందని గడ్కరీ అన్నారు. గతంలో చాలా మంది సమాజ హితం కోసం ప్రజా ప్రయోజనం కోసం కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేశారని కూడా గడ్కరీ గుర్తు చేసుకున్నారు. కోర్టులలో కేసులు పిటిషన్లు వేయడం ఒక హక్కుగా చూడకూడదని, తాము ఎన్నుకున్న ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేసేందుకు బాధ్యతాయుతంగా మెలిగేందుకు సమాజానికి ఉన్న ఒక శక్తివంతమైన సాధనంగా గడ్కరీ అభివర్ణించారు.

ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు బాధ్యతాయుతమైన పాలన కోసం కోర్టులను సమర్ధవంతంగా పౌరులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. సాధారణంగా కోర్టులలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పిటిషన్లు పడితే దానికి చికాకుగా చాలా మంది రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భావిస్తారు. కానీ గడ్కరీ మాత్రం వాటిని స్వాగతించాల్సిందే అంటున్నారు.

అంతే కాదు కోర్టుల నుంచి మొట్టికాయలు కొన్ని సార్లు పడితే కానీ మంచి నిర్ణయాలు అమలు సాధ్యపడదని ఉన్న లోగుట్టుని కూడా చెప్పేసారు. ఏది ఏమైనా నితిన్ గడ్కరీ నాగపూర్ కి వస్తే చాలు ఏదో సంచలన ప్రకటనలు ఉంటాయి. ఆయన బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు, ప్రధానమంత్రి రేసులో ఉన్న వారు. అటువంటి నేత ప్రజల తరఫున వారి గొంతుకగా ప్రభుత్వంలో ఉంటూ మాట్లాడడం అంటే నిజంగా గ్రేట్ అంటున్నారు. గట్స్ ఉన్న వారిగా గడ్కరీని అంతా అందుకే చెబుతారు మరి.