Begin typing your search above and press return to search.

సర్పంచి ఓట్ల లెక్కింపులో మతలబు..ఐదేళ్ల తర్వాత కోర్టులో నిజం బయటకు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఐదేళ్ల క్రితం సర్పంచి ఎన్నికలు జరిగాయి.

By:  Garuda Media   |   14 April 2026 3:00 PM IST
సర్పంచి ఓట్ల లెక్కింపులో మతలబు..ఐదేళ్ల తర్వాత కోర్టులో నిజం బయటకు
X

సర్పంచి ఎన్నికల్లో జరిగిన మోసం తాజాగా కోర్టులో బయటకు వచ్చింది. ఓట్ల లెక్కింపు వేళ.. అధికారుల చేతివాటం అభ్యర్థి గెలుపును ఓటమిగా మార్చటమే కాదు.. ఐదేళ్లు అధికారం లేకుండా చేసిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు సంచలనంగా మారింది. సర్పంచి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడి వాదనలో నిజం ఎమిటన్నది కోర్టు సాక్షిగా బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఐదేళ్ల క్రితం సర్పంచి ఎన్నికలు జరిగాయి. అప్పటి ఎన్నికల అధికారుల ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడి ఓడిన అభ్యర్థిని గెలిపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల లెక్కను తేల్చేందుకు కోర్టులో ఓట్ల లెక్కింపు జరగటమే కాదు.. బాధితుడి ఆరోపించినట్లే ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందన్నది తేలింది. దీంతో.. ముమ్మిడివరం మండలం గాడిలంక పంచాయితీ సర్పంచి ఎన్నికల చెల్లదని మూమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి సోమవారం తీర్పును ఇచ్చారు.

2021 ఫిబ్రవరి 21న సర్పంచి ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు పెద్దిరెడ్డి వెంకటక్రిష్ణారావుపై వైసీపీ మద్దతుదారు పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు 10 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లుగా అప్పట్లో అధికారులు ప్రకటించారు. మొత్తం 928 ఓట్లు పోల్ కాగా.. మునీంద్రరావుకు 472 ఓట్లు.. వెంకట క్రిష్ణారావుకు 462 ఓట్లు.. చెల్లనివి 19, నోటాకు 29 ఓట్లు పడినట్లుగా లెక్క కట్టారు.

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. రీకౌంటింగ్ జరపాలని కోరుతూ వెంకట క్రిష్ట్రారావు పట్టుబట్టారు. అయినా అప్పటి అధికార పార్టీ ఒత్తిడితో రీకౌంటింగ్ జరగలేదు. ఈ నేపథ్యంలో క్రిష్ణారావు కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం.. కోర్టులో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని వెంకట క్రిష్ణారావు తరఫు న్యాయవాది రెడ్డి సత్యానారాయణ మూర్తి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చెల్లని పాతిక ఓట్లను మునీందరరావు ఖాతాలో లెక్కించినట్లుగా తేలినట్లుగా పేర్కొన్నారు. చెల్లని ఓట్లుగా చూపించిన మరో 19లో ఒక ఓటు మునీంద్రరావుకు దక్కింది. చెల్లని పాతిక ఓట్లను తొలగించటంతో పద్నాలుగు ఓట్ల అధిక్యంతో టీడీపీ మద్దతుదారు వెంకటక్రిష్ణారావు గెలిచారు. ఓడిన మునీంద్రరావు ఐదేళ్లు సర్పంచి పదవిలో ఉన్నట్లైందన్నారు.

ఈ నెల రెండున అతడి పదవీ కాలం పూర్తైందని పేర్కొన్నారు. ఈ అంశంపై వెంకటక్రిష్ణారావు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపుపై తొలి నుంచి తనకు డౌట్ ఉదని.. కోర్టు న్యాయం జరుగుతుందని తాను వేచి చూసినట్లు చెప్పారు. ఐదేళ్ల కాలానికి ప్రజలు గెలిపించినా ఒక్కరోజైనా పదవి చేపట్టే అవకాశం దక్కలేదని వాపోయారు. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. మరి.. న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.