Begin typing your search above and press return to search.

గద్దర్‌ కుమారుడి పోటీ ఇక్కడి నుంచేనా?

గద్దర్‌ మరణించాక అన్ని ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చూసుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Aug 2023 10:33 AM GMT
గద్దర్‌ కుమారుడి పోటీ ఇక్కడి నుంచేనా?
X

ప్రజా యుద్ధ నౌకగా పేరు గడించిన గద్దర్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన అభిమానులు, ప్రజా సంఘాల నేతలు, కళాకారులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా గద్దర్‌ తన కుమారుడిని రాజకీయాల్లో చూడాలని ఆకాంక్షించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ సమయంలో గద్దర్‌ తోపాటు ఆయన కుమారుడు సూర్యుడు (సూర్యప్రకాశ్‌) కూడా ఉన్నారు. రాహుల్‌ గాంధీతో తన కుమారుడికి కూడా గద్దర్‌ కండువా కప్పించారు. వాస్తవానికి గద్దర్‌ కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నప్పటికీ కాంగ్రెస్‌ లోనే కొనసాగాలని నిర్ణయించారు. రాహుల్‌ గాంధీ ఖమ్మంలో సభ నిర్వహించినప్పుడు గద్దర్‌ కూడా హాజరయ్యారు. రాహుల్‌ గాంధీకి ముద్దు కూడా పెట్టారు.

గద్దర్‌ మరణించాక అన్ని ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చూసుకున్న సంగతి తెలిసిందే. తన పనులను కూడా పక్కనపెట్టి మరీ రేవంత్‌ అపోలో ఆస్పత్రికి వెళ్లడం, గద్దర్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించడంతోపాటు ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని తరలించడం, అక్కడ ఏర్పాట్లు... ఇలా సర్వం రేవంత్‌ రెడ్డే చూసుకున్నారు.

ఈ నేపథ్యంలో గద్దర్‌ చివరి కోరికను తీర్చడానికి కూడా రేవంత్‌ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గద్దర్‌ కుమారుడిని పోటీ చేయిస్తారని టాక్‌ నడుస్తోంది. హైదరాబాద్‌ నగర పరిధిలోని కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారని నెటిజన్లలో చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్‌ లో వీలు కాని పక్షంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

గద్దర్‌ కుటుంబం పట్ల కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కూడా సానుకూలంగా ఉండటంతో గద్దర్‌ కుమారుడికి సీటు ఖాయమేనని అంటున్నారు. ప్రజా గాయకుడిగా, విప్లవ నాయకుడిగా గద్దర్‌ కున్న ఇమేజ్‌ తమ పార్టీకి కలసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అందులోనూ గద్దర్‌ దళితుడు కావడం కూడా సామాజిక సమీకరణాల పరంగా తమకు లాభం చేకూరుస్తుందని లెక్కలు వేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో గద్దర్‌ కుమారుడు సూర్యంను హైదరాబాద్‌ నగర పరిధిలోని కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీకి లేదా పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయించడం ఖాయమని అంటున్నారు. తద్వారా గద్దరన్నకు ఇచ్చిన మాటను, చివరి కోరికను తీర్చాలని రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారని సమాచారం.