Begin typing your search above and press return to search.

ఆధునిక వాగ్గేయకారుడు గద్దర్

గద్దర్ ఇది ఆయన తొలి ఆల్బం పేరు. అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 12:24 PM GMT
ఆధునిక వాగ్గేయకారుడు గద్దర్
X

గద్దర్ ఇది ఆయన తొలి ఆల్బం పేరు. అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. అందరిలాగానే సామాన్యంగా పుట్టినా తనదైన ప్రతిభతో అసమాన్యుడిగా ఎదిగిన గద్దర్ తెలుగు సాంస్కృతిక ఉద్యమకారుడుగా చరిత్రలో నిలిచిపోతారు. బడుగు గుండెలకు తగిలిన గాయాల నుంచి గద్దర్ గేయాలు రాశారు. జనం వెతలే ఆయన పాటలకు పల్లవులు అయ్యాయి. దోపిడీ స్వామ్యం మీద ఆయన కలం అలుపెరగని పోరాటం చేసింది.

అసమానతల పైన ధనవంతుడు పెద్ద వాడు పేదలను దోచుకుంటున్న తీరు మీద నిరంకుశ పాలకుల మీద ఆయన పాట కత్తిగా మారి తుదికంటా పోరాడింది. గద్దర్ ఎపుడూ అధికారానికి దూరంగానే ఉన్నారు. అంటే ఆయన భావజాలం ఎపుడూ దానికి వ్యతిరేకంగా సమాంతరంగానే సాగింది. అందుకే ఆయన అధికార రాజకీయాలకు ఏనాడూ చేరువ కాలేకపోయారు.

ప్రాచీన కాలంలో పాట గానం చేసిన వారిని వాగ్గేయకారులు అనేవారు. అధునిక కాలంలో గద్దర్ ఆ ఒరవడిని పుణికి పుచ్చుకున్నారు. అలవోకగా పాటను కట్టి దానికి తనదైన గానంతో జనామోదం పొందడం బహుశా గద్దర్ కే సాధ్యమైంది అనుకోవాలి. చిన్న చిన్న పదాలు వాడుక భాషలో అతి సామాన్యుడి పెదవల వెంట సులువుగా పలక కలిగే పదాలను తన పాటగా మార్చి తిరిగి పేదింటి గూటికి చేర్చిన ప్రతిభాశాలిగా గద్దర్ ని చూడాలి.

ఆయన ప్రతీ పాట ఒక ప్రయోజనంగా మారింది. ఒక ఉద్యమాన్ని తట్టి లేపింది. ప్రతీ అక్షరం తూణీరంగా మారి సమాజం పెడధోరణి పట్ల నిరంకుశ పోకడల పట్ల గట్టిగా నిలదీసింది. గద్దర్ పాట అంటే పండిత పామరులు అంతా కూడా ఒక్కటిగా మారి ఆనందించేదిగా మారిపోయింది. ఆయన ఏలిన వారిని విమర్శిస్తూ పాట రాసిన వారు సైతం మురిసి ముచ్చటించుకునే దాకా వెళ్లింది.

అచ్చమైన ప్రజా పాటకు స్వచ్చమైన చిరునామాగా గద్దర్ పేరుని మొదటి గానే చెప్పుకోవాలి. పాటలతో సమాజంలోని కుళ్ళుని కడిగేయాలన్న గద్దర్ ఆశయం ఎన్నో దశాబ్దాల పాటు విజయవంతంగా సాగింది. గద్దర్ ది విప్లవ పంధా. ఆయనకు ప్రజాస్వామిక స్పూర్తి మీద ఎన్నికల విధానాల మీద వ్యతిరేక భావం ఉండేది. కానీ కాలక్రమంలో గద్దర్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు.

ఒక రాజకీయ పార్టీ పెట్టారు. తానూ ఓటు వేశారు. బూర్జువా పార్టీ లు అని విమర్శించిన వాటితోనే కలసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభకు గద్దర్ హాజరు కావడమే కాకుండా రాహుల్ గాంధీని ముద్దాడిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

గద్దర్ ఏడున్నర పదుల తన జీవితంలో ఎరుపు మెరుపుల మార్గాలను చూసారు. అటు నుంచి ఈ వైపుగా వచ్చి ఎన్నికల రాజకీయాలను చూశారు. ఈ దశలో ఈ దిశలో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే గద్దర్ ఎక్కడా ఎపుడూ తన అసలైన సిద్ధాంత భూమికను మరచిపోలేదు. ఆయన శ్రామిక జీవులను ఏనాడూ విస్మరించలేదు. మార్గాలు అటు నుంచి ఇటు అయినా ఎడవ వైపు భావజాలం నుంచి ప్రజాస్వామ్యం వైపు వచ్చినా పేదలకు న్యాయం చేయాలనే ఆయన గట్టిగా కోరుకున్నారు.

అందుకే ఆయన ప్రజలకు ఆరాధ్యుడు అయ్యారు. గద్దర్ పంధా అనితర సాధ్యం, ఆయన గేయం గానం రెండూ కూడా మేళవించుకుని ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గద్దర్ పాటలలో సాహిత్య పరిమళాలతో పాటు మానవత్వ సుగంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన బాట ఎపుడూ బడుగు జీవుల కోసమే అని నిరూపించుకున్నారు.

ఏడున్నర పదుల వయసులో కూడా అలసిపోని గుండె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో అకస్మాత్తుగా తనకే తెలియకుండా ఆగిపోయిందంటే అది ప్రజా పోరాటానికి ప్రజా పాటకు పెను విషాదమే. గద్దర్ అన్న మూడు అక్షరాలు మాత్రం తెలుగు సాంస్కృతిక జీవన విధానంలో ఎప్పటికీ గుర్తుండిపోయే శిలాక్షరాలు. గద్దర్ పాటను చెట్టూ పుట్టా గట్టూ చెరువూ కొలనూ కూడా ఎపుడూ పాడుకుంటునే ఉంటుంది. ఆయన గేయాలకు మరణం లేదు, ఆయన గానానికి విరామమూ లేదు. గద్దర్ అంటే గద్దరే. మళ్లీ మరొకరు ఆయనలా ఉండరు. ఉండలేరు. అంతే.