Begin typing your search above and press return to search.

గద్దర్ చనిపోవడానికి కారణం ఇదే?

కాగా... తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజుల కిందట స్వయంగా గద్దర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Aug 2023 5:17 AM GMT
గద్దర్  చనిపోవడానికి కారణం ఇదే?
X

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తర్వాత... నేను మళ్లీ వస్తా.. ప్రజా సంక్షేమం కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తా అంటూ ప్రకటించారు గద్దర్‌. అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సర్జరీ సక్సెస్ అయింది కూడా. అయినా కూడా గద్దర్ ఎందుకు చనిపోయారు?

అవును... ప్రజా గాయకుడు గద్దర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. మూడు రోజుల కిందట ఆయనకు బైపాస్ సర్జరీ చేసిన వైద్యులు.. ఆ సర్జరీ సక్సెస్ అయిందని ప్రకటించారు. మరి ఈరోజు హఠాత్తుగా ఆయన కన్నుమూయడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు అపోలో హాస్పిటల్ వైద్యులు.

అవును తాజాగా గద్దర్ బైపాస్ సర్జరీ సక్సెస్ అయినప్పటికీ ఆయన మృతికి గల కారణాలను అపోలో వైద్యులు ప్రకటించారు. గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ (77), హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్న అపోలో హాస్పిటల్ లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన జులై 20వ తేదీన హాస్పిటల్ లో చేరారు అని ప్రకటించారు వైద్యులు.

అనంతరం... ఆగస్ట్ 3న ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపిన వైద్యులు... సర్జరీ నుంచి ఆయన కోలుకున్నారని తెలిపారు.

అయితే ఆయన అప్పటికే ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో పోరాడుతున్నారని.. ఈ సమస్యలకు తోడు పెరిగిన వయసు కారణంగా ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.

కాగా... తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజుల కిందట స్వయంగా గద్దర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గత నెల 31న ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన వయసు 77 సంవత్సరాలుగా, తన వెన్నెముకలో ఉన్న తూటా వయసు 25 సంవత్సరాలుగా పేర్కొన్న గద్దర్.. తన ఆరోగ్య పరిస్థితి మొత్తాన్ని వివరించారు.

ఇదే సమయంలో త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు. అలా ప్రకటించిన వారం రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు గద్దర్.

మరోపక్క... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌ లో "గద్దర్‌ ప్రజా పార్టీని (జీపీపీ)" స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.