Begin typing your search above and press return to search.

చాక‌లి ఐల‌మ్మ‌కున్న పౌరుషం నాకు లేదా? గ‌ద్ద‌ర్‌ గా పేర్కొనే విఠ‌ల్ వేద‌న తెలుసా?

గ‌డ‌ర్‌/గ‌ద్ద‌ర్ అంటే.. 'విప్ల‌వం' అని అర్థం. ఇది పంజాబీ ప‌దం. అర‌బిక్ భాష నుంచి పుట్టింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 4:47 AM GMT
చాక‌లి ఐల‌మ్మ‌కున్న పౌరుషం  నాకు లేదా? గ‌ద్ద‌ర్‌ గా పేర్కొనే విఠ‌ల్  వేద‌న తెలుసా?
X

ఎంతో ప్ర‌శాంతంగా.. ఆనందంగా.. జ‌రిగిపోతుంద‌ని అనుకున్న ఈ ఆదివారం.. ఉరుములులేని పిడుగు ప‌డింది! అంద‌రి మ‌న‌సులను నిలువునా కుంగ‌దీసింది. దిగ్భ్ర‌మ ప‌రిచే వార్త‌ను పంపించి క్ష‌ణాల్లో హృద‌యాల‌ను ద్ర‌వించేలా చేసి.. క‌న్నీటి సుడులు పెట్టించింది. గుమ్మ‌డి విఠ‌ల్ అనే పేరుతో కాక‌.. గ‌ద్ద‌ర్ అనే బ్రిటిష్ కాలం నాటి ఒక పార్టీ పేరును త‌న ఉనికికి, మ‌నికికి జీవ‌న ప్ర‌మాణంగా మ‌లుచుకుని.. దానినే జీవ నాడి చేసుకున్న విప్ల‌వ స్వ‌రం ఎలుగెత్తి ఆకాశాన్ని తాకి.. అంత‌రిక్ష విహారానికి ఏగిపోయింది!!

'సుక‌వి జీవించు ప్ర‌జ‌ల నాల్క‌ల యందు!'- అని మ‌హాక‌వి గుర్రం జాషువా అన్న‌ట్టు.. గ‌ద్ద‌ర్ భౌతిక స్ప‌ర్శ మ‌న నేత్రాల‌కు ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, ఆయ‌న స్వ‌రం.. ఆయ‌న వాణి-బాణి.. మ‌న క‌ళ్ల‌ముందు నుంచి వీనుల నుంచి చెరిగిపోయే ప‌రిస్థితి లేదు.. రాదు కూడా!! 'విప్ల‌వ జ్యోతి సుంద‌ర‌య్య' అని కీర్తించిన క‌మ్యూనిస్టులు కూడా గ‌ద్ద‌ర్ ను అదే పంథాలో చూశారు. చూసేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు కూడా! కానీ వాస్త‌వం వేరు.. నిజ జీవితం వేరు. నా జీవితం ఇలా మారుతుంద‌ని అనుకోలేదు! అని అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్పుకొన్నారు.

''ఒక క్ల‌ర్కుగా నాకు వ‌చ్చే 400 రూపాయ‌ల జీతంతో మేం బ‌తికేయొచ్చు. కానీ, అలా చేసి.. నా ఒక్క‌డి కుటుంబాన్ని పోషించుకునేందుగా ఈ నేల‌పైకి వ‌చ్చింది. చాక‌లి ఐల‌మ్మ‌కు ఉన్న పౌరుషం నాకు లేదా? నాలో చచ్చిపోయిందా? అన్న ప్ర‌శ్నే న‌న్ను ఈ దిశ‌గా అడుగులు వేయించింది'' అని త‌న ఉద్య‌మ పంథాను వివ‌రించిన గ‌ద్ద‌ర్ అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. అయితే.. ఆయ‌న తొలుత పాల్గొన్న ఉద్య‌మాల‌న్నీ కూడా.. తెలంగాణ ఉద్య‌మాలే అనుకుంటారు.

కానీ, ప్ర‌ప్ర‌థ‌మంగా గ‌ద్ద‌ర్ పాల్గొన్న ఉద్య‌మం.. 1985లో ఏపీలోని ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌పై అనుమానితుడు(స‌స్పెక్ట్‌) షీటు తెరిచారు. జన నాట్యమండలిలో చేరాక ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ప్ర‌జా విప్ల‌వం.. ప్ర‌జా చైత‌న్యంతోనే సాధ్య‌మ‌ని మ‌న‌సా వాచా న‌మ్మిన గ‌ద్ద‌ర్‌.. జీవితాంతం అదే బాటలో న‌డిచారు.

అస‌లీ గ‌ద్ద‌ర్ అంటే ఏంటి? అనేది చాలా మందికి తెలియ‌ని విష‌యం.. 1911లో బ్రిటీష్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా న‌డిచిన 'గ‌డ‌ర్‌' అనే ఒక రాజ‌కీయ పార్టీ న‌డిచింది. గ‌డ‌ర్‌/గ‌ద్ద‌ర్ అంటే.. 'విప్ల‌వం' అని అర్థం. ఇది పంజాబీ ప‌దం. అర‌బిక్ భాష నుంచి పుట్టింది. ఇది పంజాబ్ కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. దీని భావ‌జాలం నుంచే ఉద్య‌మాలు.. ప్ర‌జాస్వామ్య యుత ఉద్య‌మాలు పుట్టుకొచ్చాయి. త‌ద‌నంత‌ర కాలంలో గ‌డ‌ర్ కాస్తా.. గ‌ద్ద‌ర్ గా మారింది. ఈ పేరునే విఠ‌ల్ పెట్టుకోవ‌డానికి కార‌ణం.. ఆ పార్టీ పంథాలోనే తాను న‌డుస్తున్నాన‌ని ఆయ‌న చెప్పుకోవ‌డంతో న‌క్స‌లైట్లు రాసిన ఓ లేఖ‌లో ఆయ‌న‌కు పెట్టుకున్న ర‌హ‌స్య పేరు ఇది! అంటే.. కేవ‌లం గ‌ద్ద‌ర్ అనేది ర‌హ‌స్య పేరు.

బ్యాంకు ఉద్యోగిగా ప్ర‌స్థానం ప్రారంభించిన విఠ‌ల్‌.. త‌ద‌నంత‌ర కాలంలో కుటుంబాన్ని త్య‌జించి.. ఒకానొక ద‌శ‌లో న‌క్స‌లిజంతో అనుసంధానం పెంచుకున్నారు. త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప్ర‌భావంతో ఆయ‌న ప్ర‌జాజీవ‌నంలోకి వ‌చ్చారు. దేనినీ ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోలేదు. స‌మస్య ప‌రిష్కార‌మే ప‌ర‌మావ‌ధిగా పనిచేశారు. తాడిత పీడిత ప‌క్షాల‌కే త‌న ఉద్య‌మాన్ని ప‌రిమితం చేయ‌లేదు. స‌మ‌స్య ఎక్క‌డుంటే.. తాను అక్క‌డ ఉండేవారు. ఇది.. గ‌ద్ద‌ర్‌ను అంద‌రికీ.. అంద‌రూ గ‌ద్ద‌ర్‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసింది!!