తెలంగాణ గడ్డ మా జాగీరు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
By: A.N.Kumar | 3 Jun 2026 8:36 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, ప్రజాగాయకుడు గద్దర్, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తుండగా తాజాగా గద్దర్ కుమార్తె వెన్నెల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తన మీడియా సమావేశంలో గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తిగా గద్దర్‌ను అభివర్ణించిన ఆయన “గద్దర్‌కు నేను కారు కొనిచ్చాను. ఆయన తరచూ నా వద్దకు వచ్చి మాట్లాడేవారు. తెలంగాణ కోసం అంతగా కష్టపడిన వ్యక్తికి అప్పటి నాయకులు తగిన గౌరవం ఇవ్వలేదనే భావన ఉంది” అని వ్యాఖ్యానించారు. అలాగే గద్దర్ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన శరీరంలో బుల్లెట్లు దిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తెలంగాణ రాజకీయ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీల నాయకులు పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టగా తాజాగా గద్దర్ కుమార్తె వెన్నెల కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం రాజకీయ పొత్తుల వల్ల కాదని, ప్రజల ఉద్యమాలు, త్యాగాలు, సాంస్కృతిక పోరాటాల ఫలితంగా ఏర్పడిందని ఆమె స్పష్టం చేశారు.
“తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాలేదు. వేలాది మంది విద్యార్థులు, యువత చేసిన త్యాగాలు, సాంస్కృతిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైంది. ఈ నేలకు గొప్ప చరిత్ర ఉంది. ప్రత్యేక అస్తిత్వం ఉంది” అని వెన్నెల పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆమె చేసిన “తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు” అనే వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. “మా నాన్న గద్దర్‌కు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండొచ్చు. ఆయనకు గౌరవం ఇచ్చి ఉండొచ్చు. కానీ తెలంగాణ చరిత్ర, ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలి. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్రానికి యజమానులు. తెలంగాణను పాలించే హక్కు కూడా తెలంగాణ ప్రజలకే ఉంటుంది” అని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు, గద్దర్ పేరును పదేపదే ప్రస్తావించడం నేపథ్యంలోనే వెన్నెల స్పందించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెన్నెల వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలా లేక రాజకీయ వర్గాల ప్రేరణతో వచ్చాయా అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది.
ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నేరుగా గద్దర్ కుటుంబం నుంచి స్పందన రావడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వెన్నెల చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు ఎలా స్పందిస్తారు? ఈ వివాదం ఇంకా ఎటువైపు మలుపు తిరుగుతుంది? అనే అంశాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
