Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో సుప్రీంకోర్టు బెంచ్.. చేవెళ్ల ఎంపీ ప్రైవేటు బిల్లు!

ఈ సిఫార్సుల వెనుక కారణం సుదూర ప్రాంతాల నుంచి సుప్రీంకోర్టు వరకు కక్షిదారు (క్లైంట్స్) చేరుకోలేకపోవడమేనని రంజిత్ రెడ్డి తెలిపారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 12:14 PM GMT
హైదరాబాద్‌  లో సుప్రీంకోర్టు బెంచ్.. చేవెళ్ల ఎంపీ ప్రైవేటు బిల్లు!
X

హైదరాబాద్‌ లో సుప్రీంకోర్టు పర్మినెంట్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి లోక్‌ సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2023 పేరుతో ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 ని కూడా ప్రస్థావించారు.

అవును హైదరాబాద్‌ లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటూ భారత రాష్ట్ర సమితి ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 సుప్రీంకోర్టును ఢిల్లీ లేదా దేశంలో మరెక్కడైనా ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

ఇదే సమయంలో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్‌ గఢ్ రాష్ట్రాలతోపాటు.. కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి, దాద్రా నాగర్ హవేలి, అండమాన్ నికోబార్ దీవులు ఈ బెంచ్ పరిధిలోకి వచ్చేలా హైదరాబాద్ కేంద్రంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న కేసుల సంఖ్యను కూడా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్థావించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 70 వేల కేసులు పెండింగులో ఉన్నాయని, కోర్టులో జడ్జిల సంఖ్య 33 మాత్రమే ఉందని, ఈ లెక్కన ప్రతి జడ్జి సుమారు 6 వేల కేసులను పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.

ఈ సిఫార్సుల వెనుక కారణం సుదూర ప్రాంతాల నుంచి సుప్రీంకోర్టు వరకు కక్షిదారు (క్లైంట్స్) చేరుకోలేకపోవడమేనని రంజిత్ రెడ్డి తెలిపారు. ఫలితంగా... చాలా కేసుల్లో కక్షిదారులు హైకోర్టు దశలోనే ఆగిపోతున్నారని.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించలేకపోతున్నారని తెలిపారు.

ఢిల్లీకి సమీపంలో ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల కేసులే ఎక్కువగా సుప్రీం వరకూ వస్తున్నాయని... కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఈ సందర్భంగా బీఆరెస్స్ ఎంపీ లోక్ సభలో వెల్లడించారు.