HCU భూములపై పోలీసుల కీలక ఆదేశాలు
ఒక్క రోజులోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం, వన్యప్రాణులపై అధ్యయనం చేశారా.
By: Tupaki Desk | 4 April 2025 8:24 PM ISTగచ్చిబౌలిలోని కంచ భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూముల్లోకి ఎవరినీ అనుమతించకుండా పూర్తి నిషేధం విధించారు. అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ భూములకు సంబంధించిన న్యాయపరమైన వివాదం కోర్టులో ఉండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఆంక్షలు విధించారు.
మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అత్యవసరంగా చెట్లను ఎందుకు నరికివేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనివల్ల పర్యావరణానికి, జంతుజాలానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ భూమి అటవీ పరిధిలోకి రాకపోయినా అక్కడ ఉన్న చెట్లను తొలగించడానికి కేంద్ర పర్యావరణ అంచనా కమిటీ (CEC) అనుమతి తప్పనిసరి అని కోర్టు తేల్చి చెప్పింది.
ఒక్క రోజులోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం, వన్యప్రాణులపై అధ్యయనం చేశారా.., ఆ భూములపై మీ ప్రణాళిక ఏమిటని వరుస ప్రశ్నలు వేసింది. ఈ ఘటనపై పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.
ఈ విచారణలో ప్రభుత్వం చెట్లను తొలగించడానికి గల కారణాలను, భవిష్యత్తులో ఆ భూమిలో చేపట్టబోయే పనుల ప్రణాళికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. పర్యావరణం, జీవ వైవిధ్యం విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. స్వార్థపూరిత అభివృద్ధి కోసం ప్రకృతిని నాశనం చేయడం సరైనది కాదనే చర్చ జరుగుతోంది.
