Begin typing your search above and press return to search.

జీ20.. ఢిల్లీ జిగేల్.. హోటళ్లు అన్నీ బుక్

ఆయన కోసం ప్రెసిడెంటల్ సూట్.. ఆయన పరివారం కోసం ఆ హోటల్ లో మొత్తం 400 రూమ్ లు బుక్ చేశారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 6:19 AM GMT
జీ20.. ఢిల్లీ జిగేల్.. హోటళ్లు అన్నీ బుక్
X

జీ20 సదస్సుకు ఢిల్లీ సిద్ధమవుతోంది. ఈసారి అతిధ్యం ఇస్తున్న భారత్ .. అందులో భాగంగా సదస్సు జరిగే ఢిల్లీని జిగేల్ అనిపించేలా సిద్ధం చేస్తోంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ 20 శిఖరాగ్రసమావేశం జరగనుంది. దీనికి ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడితో పాటు.. ప్రపంచంలో పవర్ పుల్ దేశం చైనా అధినేత.. అగ్రరాజ్యాలైన బ్రిటన్ తో సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలకు స్వాగతం పలికేందుకు.. వారికి అతిధి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు అంటే హోటళ్లకు అన్ సీజన్. జీ20 సదస్సు పుణ్యమా అని.. ఢిల్లీలోని హోటళ్లకు సుడి తిరిగింది. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో రూమ్ లు పూర్తిగా బుక్ అయిపోయాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఐటీసీ మౌర్యా షెరటన్ లో బస చేయనున్నారు. ఆయన కోసం ప్రెసిడెంటల్ సూట్.. ఆయన పరివారం కోసం ఆ హోటల్ లో మొత్తం 400 రూమ్ లు బుక్ చేశారు.

చైనా అధినేత జిన్ పింగ్ కోసం తాజ్ ప్యాలెస్ ను సిద్ధం చేశారు. అగ్రరాజ్యాల అధినేతలకు సంబంధించిన ఏర్పాట్లు చూసేందుకు ఆయా దేశాలకు చెందిన టీంలు ఢిల్లీకి వచ్చేశాయి. జీ20లో భాగస్వామ్య దేశాలకు చెందిన అధినేతలు.. వారి పరివారానికి బస ఏర్పాట్లు చేసేందుకు ఢిల్లీతో పాటు.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్టార్ హోటళ్లను బుక్ చేశారు.

ఐటీసీ మౌర్యలో బస చేసే బైడెన్ కోసం.. ప్రతి అంతస్తునూ అమెరికా రహస్య దళాలకు చెందిన కమాండోలు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. హోటల్ లోని 14వ అంతస్తులో బైడెన్ బస చేయనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కోసం షాంగ్రీలా హోటల్ ను సిద్ధం చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడి కోసం మక్రోన్ క్లారిడ్జ్స్ ను సిద్ధం చేయగా.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ అల్బనేస్ కోసం ఇంపీరియల్ హోటల్ ను రెఢీ చేశారు. టర్కిష్ ప్రతినిధుల కోసం ఒబెరాయ్ హెటల్.. మారిషస్.. నెదర్లాండ్స్.. నైజీరియా.. స్పెయిన్ తదితర దేశాల అధినేతలకు లే మెరిడియన్ ను కేటాయించారు. భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అతి క్లిష్టమైన సవాళ్లను సైతం అతి సునాయాసంగా అధిగమించే హిట్ టీములు రంగంలోకి దిగాయి.

ఎన్నికల ఏడాదిలో జరుగుతున్న జీ20 సదస్సును మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా అత్యంత చురుకైన సిబ్బందిని ఎంచుకోవటంతో పాటు.. అవసరమైతే కాల్చేసే అధికారాల్ని ఈ భద్రతా సిబ్బందికి ఇచ్చారు.

ఒక్కో టీంకు వెయ్యి మంది చొప్పున సీఆర్పీఎఫ్ కు చెందిన 50 టీంల్ని సిద్దం చేశారు. బైడెన్ భద్రతా సిబ్బంది ఆయన రావటానికిమూడు రోజుల ముందు వచ్చి హోటల్ ను తమ అధీనంలోకి తీసుకుంటాయి. మొత్తంగా జీ20 సదస్సు పుణ్యమా అని ఢిల్లీ రూపురేఖలు మార్చేసి.. జిగేల్ అనిపించేలా చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.