‘10 ఏఐ - 5 హ్యుమన్స్’.. భవిష్యత్తులో ఉద్యోగాలు ఇవే!
ప్రపంచం అనూహ్యంగా మారిపోతోంది. సాంకేతికత ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఐటీ, ఆరోగ్యం, తయారీ, విద్య వంటి రంగాలన్నీ డిజిటలైజేషన్, ఆటోమేషన్ దిశగా పయనిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 10:00 PM ISTప్రపంచం అనూహ్యంగా మారిపోతోంది. సాంకేతికత ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఐటీ, ఆరోగ్యం, తయారీ, విద్య వంటి రంగాలన్నీ డిజిటలైజేషన్, ఆటోమేషన్ దిశగా పయనిస్తున్నాయి. అర్థ శతాబ్దం క్రితం కంప్యూటర్లు లేని కార్యాలయాలు ఉండేవి. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ (AI) సహాయం లేకుండా ఏ పని జరగడం లేదు. ఈ వేగవంతమైన మార్పుతో "మీ కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు?" అనే ప్రశ్నకు కొత్త నిర్వచనం రావడం ఖాయం. నిన్నటి వరకు "200 మంది ఉద్యోగులు ఉన్నారు" అని చెప్పేవారు. కానీ రేపు ఇదే ప్రశ్నకు "మా కంపెనీలో 10 ఏఐ ఎంప్లాయిస్, 5 హ్యుమన్ ఎంప్లాయిస్" అని చెప్పే రోజులు రాబోతున్నాయి.
- ఏఐ ఎంప్లాయిస్ అంటే ఏమిటి?
"ఏఐ ఎంప్లాయిస్" అనే పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే AI ఆధారిత పద్ధతులను ఉపయోగించి అనేక పనులను నిర్వహిస్తున్నాయి. డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, డిజైన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో చాలావరకు మానవ ఉద్యోగుల పనిని రోబోట్‌లకు, బాట్‌లకు, AI మోడల్‌లకు అప్పగించారు. ఈ AI ఉద్యోగులు 24 గంటలు, సెలవులు లేకుండా పని చేయగలవు. తక్కువ సమయంలో తప్పులు లేకుండా ఫలితాలను ఇవ్వగలవు. ఒకే సమయంలో లక్షల మంది కస్టమర్లకు సేవలను అందించగలవు. మానవ తప్పిదాలు, అలసట, ఫోకస్ లేకపోవడం వంటి సమస్యలు వీరిలో ఉండవు.
-భవిష్యత్తు సంభాషణలు ఇలా మారే అవకాశముందా?
ఒక కంపెనీ గురించి వివరించేటప్పుడు "మా దగ్గర 50 మంది హ్యూమన్స్, 300 ఏఐ మాడ్యూల్స్ ఉన్నాయ్" అని చెప్పే రోజులు వస్తాయి. గూగుల్‌లో ఈ తరహాలో చెప్పే అవకాశం ఉంది. "మా డేటా ప్రాసెసింగ్ టీమ్‌లో 5 హ్యూమన్ సీనియర్ ఎనలిస్టులు, 200 ఎల్క్ స్టాక్ ఆధారిత ఏఐ లాజిక్ మాడ్యూల్స్ పని చేస్తున్నాయి" అని చెబుతున్నారు కూడా.. దీని వల్ల కంపెనీకి వాస్తవానికి ఎంత మందితో పని జరుగుతోందో చెప్పేటప్పుడు "సిరి, చాట్‌బాట్, GPT, కోడింగ్ అసిస్టెంట్, క్లౌడ్ మేనేజర్" వంటి AI పేర్లను ఉద్యోగుల జాబితాలో పేర్కొనడం సాధారణం అవుతుంది.
- మానవ ఉద్యోగులకు ఇది ప్రమాదమేనా?
కానీ ఇది పూర్తిగా మానవ ఉద్యోగాలను ఖతం చేసే దిశగా ఉండకపోవచ్చు. ఎందుకంటే: క్రియేటివిటీ, భావప్రకటన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్‌షిప్ వంటి అంశాల్లో ఇప్పటికీ మనుషులే అవసరం. AI ఎథికల్ బౌండరీస్, ఇన్నోవేషన్, విజన్ సెట్టింగ్ వంటి పనుల్లో మానవులు కీలకం. AI ఎంతటి ప్రగతి సాధించినా, కొత్త సాంకేతికతలను నేర్పడం, సమస్యలను డిజైన్ చేయడం, అన్వేషించని రంగాల్లో పరిశోధన చేయడం మానవులకే సాధ్యం.
అందువల్ల ఎప్పటికీ కొన్ని రకాల పనులకు మనుషులే అవసరం. కానీ సాధారణ, రిపిటేటివ్, డేటా ఆధారిత పనులన్నీ AIకి బదిలీ అయ్యే అవకాశముంది. ఏఐ–హ్యూమన్ కాంబోలో కొత్త ఉద్యోగాలు రావచ్చు.
- సమాజంపై ప్రభావం
ఈ మార్పులు జీతాల విధానాలపై, ఉద్యోగ భద్రతపై, స్కిల్లింగ్ విధానాలపై, విద్యాపద్ధతులపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. బీఏ, బీకాం లాంటి కోర్సులకు డిమాండ్ తగ్గి, డేటా సైన్స్, ఎథిక్స్ ఆఫ్ ఏఐ, ఏఐ మేనేజ్‌మెంట్ వంటి కొత్త కోర్సులు ఉద్భవించనున్నాయి.
"మీ కంపెనీలో ఎంత మంది?" అనే ప్రశ్నకు "10 ఏఐ, 5 హ్యూమన్స్" అని జవాబు ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అభివృద్ధి చెందాలంటే, ప్రతి ఒక్కరూ ఓపెన్ మైండ్‌తో, నిరంతర నేర్చుకునే దృక్పథంతో ఉండాలి. అప్పుడే ఈ మార్పులలో విజయం సాధించగలుగుతాం.
